రేసుని రక్తి కట్టిస్తోన్న డొనాల్డ్ ట్రంప్!
Publish Date:Sep 4, 2016
Advertisement
2014కి ముందు ఇండియాలో ఏం జరిగిందో అలాంటిదే ఇప్పుడు అమెరికాలో జరుగుతోంది! మన దగ్గర మోదీ పీఎం అన్న మాటలు అంతకు ముందు చాలా సార్లు వినిపించేవి. కాని, అంతా కొట్టిపారేసేవారు! బీజేపిలోనూ చాలా మంది నేతలు మోదీ ప్రధాని అవుతాడని ధైర్యంగా చెప్పేవారు కాదు. కాని, అమాంతం 2014 ఎన్నికల సమయం వచ్చేసరికి అందర్నీ నమో వెనక్కి నెట్టేశారు. అనూహ్యంగా బీజేపికి స్వంతంగా ఫుల్ మెజార్జీ సంపాదించి పెట్టి తాను పీఎం అయ్యారు! ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఇంచుమించూ మోదీలానే దూసుకొస్తున్నారు!
డొనాల్డ్ ట్రంప్ మోదీ లాగా వార్తల్లో వుండొచ్చు. కాని, మోదీ లాంటి ఫుల్ టైం పొలిటీషన్ కాదు. పక్కా బిజినెస్ మ్యాన్. వందల కోట్ల వ్యాపారాలు వున్నాయి ట్రంప్ కి. అందుకే మొదట్లో అతడ్ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు. అందరి దృష్టీ డెమొక్రాట్ అభ్యర్థి, మాజీ అధ్యక్షడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ పైనే వుండేది. కాని, మెల్లమెల్లగా ట్రంప్ హై వే పై ట్రక్కులా దూసుకొచ్చాడు. రోజుకో వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించి ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచాడు!
డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి అయ్యాక చాలా మంది పోటీ వన్ సైడ్ అనుకన్నారు. హిల్లరీ అమెరికాలోని అనేక వర్గాల మద్దతు కూడగట్టి ఈజీగా ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవుతుందని అనుకున్నారు. కాని, అది కూడా ఇప్పుడు తలకిందలు అవుతున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ పై హిల్లరీ ఈజీగా గెలుస్తుందని నిన్నటి మొన్నటి దాకా చెప్పిన సర్వేలు మెల్లగా ట్యూన్ మారుస్తున్నాయి. సీఎన్ఎన్ తాజా సర్వే అయితే గతంలో కంటే హిల్లరీ ఆధిక్యం సగం తగ్గిపోయిందని చెబుతోంది! హిల్లరీ 42 శాతం మంది మద్దతు పొందుతోంటే ట్రంప్ 37శాతం మంది సపోర్ట్ తో చాలా దగ్గరగా వున్నాడు రేస్ లో!
అమెరికా అధ్యక్షడు ఎవరవుతారన్న ఆదుర్దా మొత్తం ప్రపంచానికి వుండటం సహజమే! కాని, ఈ సారి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మాత్రం మరీ ఎగ్జైటింగ్ గా సాగుతున్నాయి. నవంబర్ లో తేలనున్న చివరి ఫలితం అప్పటి వరకూ ఊరిస్తూనే వుండేలా వుంది. ఎందుకంటే, డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు ఏ అమెరికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థీ చేయని విధంగా కామెంట్స్ చేశాడు. ముస్లిమ్ లను దేశంలోకి రానీయనని ఘాటుగా మాట్లాడిన ఆయన రోజుకో విధంగా నిప్పు రాజేస్తూనే వున్నాడు. ఒకవేళ ఆయనే అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ముందు ముందు అనేక సంచలనాలు, సంక్షోభాలు చూడాల్సి రావచ్చు! ఎన్నారై ఇండియన్స్ అయితే ఎక్కువగా హిల్లరీనే కోరుకుంటున్నారని సమాచారం...
http://www.teluguone.com/news/content/america-president-elections-45-66056.html





