బెజవాడ 'దేశం'లో చీలికలు
Publish Date:Apr 26, 2012
Advertisement
రాష్ట్ర రాజకీయ రాజధానిగా పేరుపొందిన విజయవాడలో తెలుగుదేశం పార్టీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు అగ్రకులానికి చెందిన ఒక సామాజిక వర్గం తమను అణిచివేయటానికి ప్రయత్నిస్తోందని దళిత మైనారిటీ నాయకులు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అగ్రకులానికి చెందిన నాయకుల్లో కూడా ఏ మాత్రం సఖ్యత లేకపోవటంతో తెలుగుదేశంపార్టీ పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. లగడపాటి మీద పోటీ చేసి ఓడిపోయినా వల్లభనేని వంశీ కూడా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అగ్రనేతలు ఎవరూ ఆయన్ని పట్టించుకోవటం లేదు. దీంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జి బుద్దావెంకన్న, సెంట్రల్ నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జి బోండా ఉమామహేశ్వరరావుపై ద్వితీయశ్రేణి నాయకులందరూ తిరుగుబాటు ప్రకటించారు. అర్బన్ టిడిపి కార్యదర్శులు పరిశపోగు రాజేష్, దాసరి జయరాజు, బూదాల ఆదమ్ మరో నాయకుడు కామా దేవరాజ్ బహిరంగంగానే ఇద్దరు నాయకులపై తమ అసంతృప్తి గళం విప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ సీనియర్లుగా ఉంటున్న తమను పరిగణనలోకి తీసుకోకుండా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే పార్టీ పదవులు ఇవ్వటం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టానం జోకం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరతామని హెచ్చరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/vijayawada-telugu-desham-party-cadre-24-13640.html





