తెలంగాణ లేదు ఆర్థిక మండలి లేదు : హోంశాఖ
Publish Date:Dec 22, 2011
Advertisement
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదంటూ తేల్చి చెప్పిన యూపీఏ ప్రభుత్వం ఇపుడు ఆ ప్రాంత అభివృద్ధికి ఏర్పాటు చేయదలచిన ప్రత్యేక ఆర్థిక మండలిని సైతం ఏర్పాటు చేయలేమనే సంకేతాలను పంపించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ తెలిపింది.తెలంగాణ ఇవ్వడం కష్టమంటూ గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రెండుసార్లు పరోక్షంగా పేర్కొనగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర హోంశాఖ వివిధ సందర్భాల్లో మూడుసార్లు అది అంత సులభం కాదని తేల్చి చెప్పింది. దీనిపై హోంశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ మన దేశ సమాఖ్య రాజకీయ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందన్నారు.
రాష్ట్ర విభజనపై ఆ రాష్ట్రంలో విస్తృత ఏకాభిప్రాయం ఏర్పడిన తర్వాతే కేంద్రం ముందడుగు వేస్తుందని స్పష్టం చేశారు. అయితే, ఇందుకు ఎంత సమయం పడుతుందో నిర్ధిష్టంగా చెప్పలేమన్నారు. అలాగే, తెలంగాణ ప్రాంతీయ మండలిపై నిర్ణయం తీసుకోవాలనే ప్రతిపాదనను చురుగ్గా పరిశీలించిన కేంద్రం ఇప్పుడు దాన్నీ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.తెలంగాణ ఉద్యమం పూర్తిగా చల్లారి పరిస్థితులు గాడిన పడుతున్న సమయంలో, ప్రాంతీయ మండలిని ప్రకటించి మరోసారి తెలంగాణపై రణగొణ ధ్వనులు సృష్టించడం ఎందుకని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని కేంద్రం పూర్తిగా పక్కన పెట్టిందనేందుకు ఆ ప్రాంత ఎంపీలను విస్మరించడమే నిదర్శనమని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/upa-government-24-10181.html





