పదవి ఆశించట్లేదా? ఎలాగూ ఇవ్వర్లెండి
Publish Date:Jul 4, 2015
Advertisement
పదవులు కావాలని అనుకుంటున్న వారికి, అధికారం లేక అల్లాడిపోతున్నవారికి, అధికారంలో వున్న చేతిలో డబ్బు ఆడని వాళ్ళకి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్వర్గధామంలా కనిపిస్తోంది. ఆ పార్టీలో చేరిపోతేచాలు తమ ఆశయాలన్నీ నెరవేరతాయని ఆశిస్తున్నారు. అందుకూ ఇతర పార్టీల్లో పదవుల్లో వున్న పెద్దమనుషులు టీఆర్ఎస్ బాట పడుతూ వచ్చారు. ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారంలో వున్నవారు టీఆర్ఎస్ బాట పట్టడం తగ్గింది. ఇప్పుడు ఎలాంటి పదవీ లేకుండా రాజకీయ నిరుద్యోగులుగా వున్న వాళ్ళు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. వారిలో ఒక పెద్ద తలకాయ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్.
మొన్నటి వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వున్న ఆయన తనను కాంగ్రెస్ పార్టీ మరోసారి ఎమ్మెల్సీ చేయలేదని అలిగారు. దాంతో పార్టీ మారిపోతున్నారు. కొంతమంది పార్టీలు మారితే పోనీలెండి అనిపిస్తుంది. మరికొందరు పార్టీ మారితే కడుపులో దేవినట్టు అనిపిస్తుంది. చివరికి ఈ పెద్దమనిషి కూడా పార్టీ మారాడా అని రాజకీయ వ్యవస్థ మీదే అసహ్యం పుట్టుకొస్తుంది. ఇప్పుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని మారడం కూడా అలాంటి ఫీలింగ్స్‌నే కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు దర్జాగా వెలగబెట్టిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ఆరిపోయి వున్న పరిస్థితిలో ఆ పార్టీని విడిచిపెట్టడం అనేది ఘోరమైన విషయం. ఆయన పార్టీ మారుతున్నది పదవి ఇవ్వనందుకే అనే విషయం అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ, తాను పార్టీ మారుతున్నది పదవుల కోసం కాదని చెబుతూ డి.శ్రీనివాస్ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తాను టీఆర్ఎస్‌లో చేరాక ఎలాంటి పదవి ఆశించడం లేదని చెబుతున్నారు. అయితే ఆయన పదవి ఆశించినా, ఆశించకపోయినా ఆయనకు ఇవ్వడానికి అక్కడ ప్రస్తుతం పదవులేవీ లేవు. ఒకవేళ వున్నా, పార్టీ కోసం ఎప్పటినుంచో ‘సేవ’ చేస్తున్నవారు వాటి కోసం కాసుకుని కూర్చుని వున్నారు. అంచేత డి.శ్రీనివాస్‌కి పదవి వచ్చే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వ్రతం చెడ్డా ఫలం దక్కాలంటారు.. పాపం డి.శ్రీనివాస్‌కి పార్టీ మారినా ప్రతిఫలం దక్కదన్నమాట.
http://www.teluguone.com/news/content/trs-d-srinivas-45-48050.html





