లేనిపోని తలనొప్పులు ఎందుకో?
Publish Date:Jul 4, 2015
Advertisement
తెలంగాణ ప్రభుత్వ సైకాలజీ మీద పరిశోధనలు జరిపి డాక్టరేట్ పొందడానికి ఎవరైనా పరిశోధకులు ప్రయత్నం చేయొచ్చు. అయితే వారి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో, వారు ఎంతవరకు తెలంగాణ ప్రభుత్వ సైకాలజీని అర్థం చేసుకుంటారన్నది చెప్పడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వ సైకాలజీ అంత సంక్లి్ష్టంగా వుంది మరి. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం, అనేక విషయాలలో తెలంగాణ సర్కారుకు ఎదురు దెబ్బలు తగలటం, మొట్టికాయలు పడటం మామూలైపోయింది. కొన్ని విషయాలలో తాము విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో వున్నవాటిలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇరుకున పడిన సందర్భాలు ఈ సంవత్సర కాలంలో ఎన్నో వున్నాయి. లేటెస్టుగా సెక్షన్ 10లో వున్న సంస్థల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి దెబ్బలు తగులుతున్నాయి. ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా ప్రవేశాలు ఇవ్వాలంటే గవర్నర్ నరసింహన్ లేఖ రాశారు. ఇలా ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ, తల బొప్పి కడుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో అనవసరంగా వివాదాలు పెట్టుకోవడం మానుకోవడం లేదు. దీనికి తాజా ఉదాహరణ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో టీ సర్కార్ కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేయడం. ఈ పరిణామం రెండు రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తున్నవారికి మింగుడు పడని విధంగా వుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంలో ఒక పద్ధతి వుంది. అయితే పట్టిసీమ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం మాత్రం విచిత్రంగా వుంది. సముద్రంలో కలసిపోయే నీటిని కాపాడుకోవడానికి ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు కడుతుంటే, దానికి తెలంగాణకు అభ్యంతరం ఏమిటో, కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం. ఇలాంటి విచిత్రమైన ఫిర్యాదులు చేయడం వల్ల భవిష్యత్తులో మరో ఎదురుదెబ్బ తినడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టే భావించాల్సి వుంటుంది.
http://www.teluguone.com/news/content/pattiseema-telangana-45-48051.html





