ఈ చిత్రపటాల రాజకీయం మండిపోను!
Publish Date:Jul 4, 2015
Advertisement
చేటూ పాటూ లేనమ్మ ఇల్లెక్కి పిండి కొట్టిందనేది సామెత. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇలాగే తయారైంది. మొన్నటి వరకూ అధికారం వెలగబెట్టి అటు దేశాన్ని, ఇటు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకులు సర్వనాశనం చేశారు. అధికారంలో వున్నప్పుడు ఒకర్నొకరు తిట్టుకుంటూ కాలక్షేపం చేసిన కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు అధికారం, పదవులు పోయినా బుద్ధి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో అధికారం చెలాయించిన డి.శ్రీనివాస్ ఇప్పుడు తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఎక్స్‌టెన్షన్ చేయలేదన్న కోపంతో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో వున్నందువల్ల లాభం లేదు... టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోవడం వల్ల నష్టం లేదు. కాకపోతే ఆయనగారు పార్టీ మారుతున్న సందర్భంగా జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటేనే చిరాకు పుడుతోంది.
గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన కె.కేశవరావు, బొత్స సత్యనారాయణ, డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వదిలపెట్టేశారు కాబట్టి వారి ఫొటోలు గాంధీభవన్లో వుండకూడదని మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఫీలయ్యారు. అక్కడితో ఆగకుండా గాంధీ భవన్లో వున్న పై ముగ్గురి చిత్రపటాలను తీసి అవతల పారేశారు. వారి చిత్రపటాలయితే తీసిపారేశారుగానీ, వారు కాంగ్రెస్ పార్టీకి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన నష్టాన్ని మాత్రం తొలగించగలరా? ఇదిలా వుంటే, తన చిత్రపటం గాంధీభవన్లోంచి తీసిపారేయడం పట్ల డి.శ్రీనివాస్ తెగ ఫీలయ్యారు. తన చిత్రపటాన్ని తీసిపారేసిన వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నానని సెలవిచ్చారు. ఈయనగారికి కాంగ్రెస్ పార్టీ అక్కర్లేదుగానీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాత్రం ఆయన ఫొటో మాత్రం వుండాలి. ఆశ దోశ అప్పడం వడ. కాంగ్రెస్ పార్టీని నిర్దాక్షిణ్యంగా దెబ్బకొట్టేసి టీఆర్ఎస్‌లోకి వెళ్తున్న డి.శ్రీనివాస్ మదర్ సెంటిమెంట్‌ని పుష్కలంగా పండిస్తున్నారు. గాంధీ భవన్లోంచి తన చిత్రపటాన్ని తీసేసినప్పటికీ, తాను మాత్రం తన ఇంట్లోంచి సోనియా గాంధీ చిత్రపటాన్ని మాత్రం తీసేయనని అంటున్నారు. ఈ కాకాలేంటో, కాంగ్రెస్ రాజకీయాలేంటో!
http://www.teluguone.com/news/content/d-srinivas-45-48049.html





