ఏపీలో థియేటర్లు ఓపెన్.. 70కోట్లు ఎవరివి?.. బ్లేడ్ బ్యాచ్ దాడి.. టాప్‌న్యూస్ @1pm
Publish Date:Dec 30, 2021
Advertisement
1. ఏపీలో సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నెలరోజుల్లో థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 9 జిల్లాల్లో సీజ్ అయిన 83 థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇందు కోసం జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. 2. సమూహ ప్రాజెక్ట్స్ సంస్థపై ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నట్టు పలు వార్తా కథనాలు వస్తున్నాయి. ఏకంగా 70కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ కంపెనీ కొందరు వైసీపీ పెద్దల బినామీ సంస్థ అని అంటున్నారు. సమూహా ప్రాజెక్ట్స్ సంస్థ ఓ వైసీపీ మంత్రికి చెందినదిగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 3. గతేడాది అక్టోబర్ నెలలో భారీ వర్షాలతో 12 కి.మీ. ఉండే హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా పొంగిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. రిటైనింగ్ వాల్ ఒక్కటే ఈ నాలా పొంగి ఇళ్లలోకి నీరు రాకుండా ఉండేందుకు పరిష్కారమని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కలిసి హైదరాబాద్ నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరామని.. వెంటనే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం రూపొందించినట్టు తెలిపారు. 858 కోట్లతో మొదటి దశ ప్రాజెక్టు పనులు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. 4. గుంటూరులోని టవర్‌కు జిన్నా పేరు పెట్టడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ద్రోహి ఆలీ జిన్నా పేరు గుంటూరులో టవర్‌కు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎక్కడో పాకిస్తాన్లో ఉండాల్సిన పేరు ఇక్కడ పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. ఆ టవర్‌కు అబ్దుల్ కలామ్ లేదా గుర్రం జాషువా పేర్లు పెట్టాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. 5. హైదరాబాద్ నాంపల్లిలో జరిగే ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఎగ్జిబిషన్ వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఎగ్జిబిషన్ ఏర్పాట్లను నిలిపివేయాలని పట్టుబట్టారు. పలు రాష్ట్రాలు న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాయని.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. 6. మాచర్లలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డికి కార్యకర్తలు, అభిమానులు స్వాగత ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత రాత్రి పలు సెంటర్లలో ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 7. అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు పవర్ కట్ చేస్తూ విద్యుత్ శాఖ ఝలక్ ఇస్తోంది. భారీగా పెండింగ్ బిల్లులు ఉండటంతో కోతలు విధిస్తోంది. మొన్న పుట్టపర్తి పంచాయితీ ఆపీసు.. తాజాగా అనంతలో జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పవర్ సప్లై ఆపేసింది. 3.86 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు విద్యుత్ అధికారులు తెలిపారు. 8. డ్రంకన్ డ్రైవ్ ప్రమాదకరమంటూ ప్రచారం చేస్తున్న పోలీసులు ఆ నిబంధనను ఉల్లంఘిస్తూ ప్రమాదానికి కారకులవుతున్నారు. ఒంగోలులో ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణ మద్యం మత్తులో బైక్‌ను నడుపుతూ ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన యువకుడు దినేష్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 9. విజయవాడ వైఎస్సార్ కాలనీలో బ్లేడ్ బ్యాచ్ వ్యక్తి వీరంగం సృష్టించాడు. గంజాయి సేవించి స్థానికులపై దాడికి యత్నించాడు. దీంతో స్థానికులు అతనిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు. 10. "తిరుమలలో పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా సంపూర్ణంగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నాం. దుకాణాల నిర్వాహకులు కూడా బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగులనే వినియోగించాలి" అని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. మూడు నెలలు గడువు ఇస్తున్నామని, అందరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలన్నారు.
http://www.teluguone.com/news/content/top-news--1pm-39-129337.html





