కొత్త సంవత్సరం ముంగిట కొత్త వేరియంట్ ముప్పు..
Publish Date:Dec 30, 2021
Advertisement
కొత్త సంవత్సరం తలుపులు తడుతోంది...మరో కొద్ది గంటల్లోనే 2022 వచ్చేస్తోంది. అయితే, కొత్త సంవత్సరం కంటే ముందే వచ్చిన... కరోనా మహమ్మరి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచం మొత్తాన్ని మరోమారు భయం మూడ్’లోకి తీసుకుపోయింది. కొత్త సంవత్సరం ముంగిట పొంచి ఉన్న కొత్త వేరియంట్ ముప్పు ... భయపెడుతోంది. వేడుకలకు ఆంక్షలు బ్రేకులు వేస్తున్నాయి.. మళ్ళీ మరోసారి ప్రపంచం కలవరపాటుకు గురవుతోంది. అమెరికా, యూకే , ఇంకా అనేక దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ కేసులతో పాటుగా కొవిడ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. అనేక దేశాల్లో ప్రతిరోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఒకే రోజులో 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. యూకేలోనూ రోజుకు లక్షకు పైగానే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. మన దేశంలోనూ కేసుల సంఖ్య క్రమంగా, వేగంగా పెరుగుతోంది.దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగు అంకెల సంఖ్యకు చెరువుగా వుంది. ఇంతవరకు 800లకు పైగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో మహారాష్ట్రతో పాటు రాజస్థాన్, గుజరాత్లో భారీగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నిన్న (బుధవారం) ఒక్కరోజే 85 ఒమిక్రాన్ కేసులు రావడం కలకలం రేపుతోంది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 252కి పెరిగింది. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,195 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. తెలంగాణ ఒమిక్రాన్ కేసుల్లో దేశంలో నాల్గవ స్థానంలో ఉందని అధికార గణాంకాలు సూచిస్తున్నాయి. ఏపీలో నిన్న (బుధవారం) ఒక్క రోజే 10 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 16కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు రాగా.. అనంతపురం జిల్లాలో రెండు, కర్నూలు రెండు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఒకేసారి ఇన్ని కేసులు రావడంతో..ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవంక ఒమిక్రాన్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్తున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలుచేస్తున్నారు.ఢిల్లీ ప్రభుత్వం యెల్లో హెచ్చరిక జారీచేసింది. స్కూల్స్,మాల్స్ మూసేయడంతోపాటుగా 50 శాతం ఆంక్షలు అమలులోకి తెచ్చింది. కాగా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో, కొవిడ్-19 ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఇలా డిసెంబర్ 20-26 తేదీల మధ్య ప్రపంచవ్యాప్తంగా సుమారు 50లక్షల కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల్లో 11శాతం పెరుగుదల కనిపించినట్లు పేర్కొంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్’తో పాటుగా కొవిడ్-19 ఉదృతి పెరగడం మరింత ఆందోళనకు గురిచేసే అంశంగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో ఉదృతి అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గడిచిన వారంలో నమోదైన మొత్తం 49.9లక్షల కేసుల్లో 28లక్షల కేసులు కేవలం యూరప్‌లోనే ఉన్నాయి. ఇన్ఫెక్షన్ రేటు కూడాయూరప్లోనే అధికంగా ఉంది. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కొత్త వేరియంట్ ముప్పు అధికంగానే ఉందని స్పష్టం చేసింది. డెల్టా కంటే కూడా ఒమిక్రాన్ ప్రాబల్యం ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అయితే, దక్షిణాఫ్రికా, యూకే, డెన్మార్క్లనుంచి వస్తోన్న సమాచారాన్ని చూస్తే ఒమిక్రాన్‌తో ఆస్పత్రికి చేరే కేసులు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని, అలాగే మరణాల ముప్పు కూడా తక్కువే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా గతవారంలో కొవిడ్ మరణాల సంఖ్య 4శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. అయితే, ముందు ముందు ఇదే పరిస్థితి ఉంటుందా?అయినప్పటికీ ఆక్సిజన్, వెంటిలేషన్ అవసర, మరణాల ముప్పు ఇలాగే ఉంటుందా అంటే ఈవిషయంలో నిర్ధారణకు వచ్చేందుకు మరింత సమాచారం అవసరముందని పేర్కొంది.
http://www.teluguone.com/news/content/new-variant-tension-in-new-year-39-129330.html





