క్లైమాక్స్ టికెట్!.. జగనన్న సారీ.. మోదీకి నోటీసులు.. టాప్‌న్యూస్ @1pm
Publish Date:Feb 10, 2022
Advertisement
1. సినిమా టికెట్ల వివాదానికి శుభం కార్డు పడుతుందని చిరంజీవి అన్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌తో చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆలీ, పోసాని తదితరులు సమావేశమయ్యారు. ఏపీలో టిక్కెట్ల ధరలపై ప్రభుత్వ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు. 2. ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు అంశంలో ప్రధాని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. రాజ్యసభ సెక్రటరీకి టీఆర్ఎస్ ఎంపీలు నోటీసులు అందజేశారు. ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని.. 187వ నిబంధన కింద నోటీసు ఇస్తున్నట్టు ఎంపీలు తెలిపారు. 3. ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎక్కడా కూడా వ్యతిరేకించలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈరోజు బ్రేకింగ్, రేపు హెడ్ లైన్స్‌లో ఉండేందుకే టీఆర్ఎస్ ఎంపీలు ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని అన్నారు. పార్లమెంట్‌లో ఓటింగ్ సందర్భంగా విజయశాంతి పాల్గొంటే కేసీఆర్ ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. తెలంగాణ బిల్లు సమయంలో కేసీఆర్ హాజరుకాలేదనే అంశంపై తెలంగాణలో చర్చ జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. 4. విశాఖలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలు విధించడం, ప్రజలు ఇబ్బందులు పడటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, ఘటనపై సీఎం జగన్ స్పందించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ సంఘటనపై విచారణ చేసి భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. 5. గుంటూరు జిల్లా సుద్దపల్లి క్వారీల దగ్గర టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర నిరసన దీక్షకు దిగారు. అక్రమ మైనింగ్ ఏ మేరకు జరిగాయో నిగ్గు తేల్చాలని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. దీక్షతో దిగొచ్చిన మైనింగ్ అధికారులు క్వారీలను పరిశీలించారు. అక్రమ మైనింగ్ క్వారీలో కొలతలు తీశారు. అధికారుల హామీతో ధూళిపాళ్ల ఆందోళన విరమించారు. 6. వైసీపీ పాలనలో ప్రజల్ని కన్నింగ్ చేయటం, గనుల్లో మైనింగ్ చేయటం తప్ప.. రాష్ట్ర అభివృద్ధి శూన్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. గుంటూరు సుద్దపల్లిలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న దూళిపాళ్ల నరేంద్ర కు మద్దుతు తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతల హౌస్ అరెస్టులు దుర్మార్గమన్నారు. వైసీపీ నేతల బండారం బయటపడుతుందనే టీడీపీ నేతల్ని ఇంట్లో నుంచి బయటకు రానివ్వటం లేదని మండిపడ్డారు. 7. హిజాబ్ వివాదంపై కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. స్త్రీలు సృష్టికర్తలని.. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. నుదుట సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు.. హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ అవుతుందని కవిత అన్నారు. ఎలా ఉండాలి? ఏం ధరించాలి? ఏం చేయాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాయిష్టాలకే వదిలేయాలన్నారు కవిత. 8. ఏపీలో జగనన్న వసూళ్ల రాజా ప్రభుత్వం నడుస్తోందన్నారు బీజేపీ నేత లంకా దినకర్. నిన్న అమరావతి మీద విషపు కన్ను పడిందని, ఇవాళ ఆటోనగర్లపైన, రేపు అందరి ఆస్తులపైన పడే ప్రమాదం ఉందన్నారు. ఆటోనగర్ల భూములను యాజమాన్యం కొనుగోలు చేసుకున్న ఆస్తి హక్కు, దాన్ని పీక్కునే హక్కు రాష్ట్ర ప్రభుత్వంకి లేదన్నారు. 9. ఏపీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలకు దిగారు. ‘చలో కలెక్టరేట్’ పేరుతో జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పలు చోట్ల భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపట్టాలని.. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. 10. గాజువాక 66వ వార్డు వైసీపీ కార్పోరేటర్ మహ్మద్ ఇమ్రాన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఓ కేసు సెటిల్మెంట్‌లో దళిత యువకుడిని చితకబాది కులం పేరుతో దూషించినట్టు గాజువాక పోలీసులకు బాధిత యువకుడు ఫిర్యాదు చేశాడు. వైసీపీ కార్పోరేటర్ ఇమ్రాన్‌తో పాటు అతని అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
http://www.teluguone.com/news/content/top-news--1pm-39-131548.html





