తెలుగుదేశం కొత్త ఫైర్ బ్రాండ్ కావలి గ్రీష్మ.. మహానాడు ప్రసంగంతో పార్టీలో జోష్
Publish Date:Jun 1, 2022
Advertisement
ఒంగోలు వేదికగా జరిగిన మహానాడులో పార్టీకి ఒక కొత్త ఫైర్ బ్రాండ్ దొరికింది. ఆమె కావలి గ్రీష్మ. కావలి గ్రీష్మ ప్రసంగం తెలుగుదేశం కేడర్ లో ఓ కొత్త జోష్ ను నింపింది. ముఖ్యంగా కావలి గ్రీష్మ మాటల్లో వాడి, వేడి యమా సూపర్ అని కేడర్ పేర్కొంటోంది. ఇక ఇదే వేదికపై నుంచి ముఖ్యమంత్రి జగన్ ను మిస్టర్ సీఎం అంటూ ఏకవచనంతో సంబోధించడమే కాదు.. ఆయనకు నేరుగా తొడగొట్టి మరీ సవాల్ విసరడం పట్ల పార్టీ సీనియర్ నేతలు సైతం అభినందనలు తెలుపుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. తన ప్రసంగంలో అధికార పార్టీపై గ్రీష్మ నిప్పులు చెరిగింది. జగన్ దావోస్ పర్యటనపై ఆమె సంధించిన సెటైర్లు, కామెంట్లు ఇప్పడు పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. మహానాడు వేదికగా గ్రీష్మ ప్రసంగిస్తున్నంత సేపూ లీడర్ నుంచి కేడర్ వరకు అందరూ మెస్మరైజ్ అయ్యారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే కావలి గ్రీష్మను పార్టీ అధికార ప్రతినిధిగా తెలుగుదేశం నాయకత్వం నియమించింది. పార్టీ అధికార ప్రతినిధిగా నియమితురాలైన కొద్ది రోజులలోనే ఆమె తన వాగ్ధాటితో మహానాడు వేదికగా విపక్షానికి సవాల్ విసిరారు. వైసీపీలో కొడాలినాని, పేర్ని నాని వంటి వారికి దీటుగా బదులిచ్చే బలమైన గళాలు తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నాయని మహానాడు వేదికగా గ్రీష్మ ప్రసంగం తిరుగులేని విధంగా నిరూపించిందని పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఇక అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎండగట్టేందుకు కావలి గ్రీష్మ రూపంలో బలమైన ఆయుధం దొరికిందని పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఆమె ప్రసంగాన్ని మెచ్చుకున్నారని అంటున్నారు. ఇంత కాలం తెలుగుదేశం పార్టీలో వైసీపీలోని బూతుల నేతలకు దీటుగా సమాధానం ఇచ్చే విషయంలో కొద్ది పాటి వెనుకబాటు తనం కనిపించిందనీ, అయితే గ్రీష్మ ప్రసంగ తరువాత మరింత మంది ఆమెలా ధాటిగా, ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వడానికి ముందుకు వస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. మోహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు ప్రత్యర్థి విమర్శలకు దీటుగా బదులివ్వడమే కాకుండా, ప్రతి విమర్శలతో చెలరేగిపోయే గ్రీష్మ లాంటి యువత అవసరం ఇప్పుడు ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వైసీపీలో ఆర్కే రోజా, అంబటి రాంబాబు ఇంతకీ కావలి గ్రీష్మ ఎవరు అంటూ మహానాడు తర్వాత నెటిజన్లు గూగుల్ లో విపరీతంగా సెర్చి చేశారట. ఇంతకీ ఆమె ఎవరంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన కావలి ప్రతిభా భారతి కుమార్తె. 2017లో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన గ్రీష్మ అప్పటి నుంచీ పార్టీ కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె రాజాం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే అధికార ప్రతినిధిగా పార్టీ బాధ్యతలు చేపట్టారు.
విజయసాయిరెడ్డి, జోగి రమేష్ తదితరుల అసంబద్ధ విమర్శలు, అనుచిత వ్యాఖ్యలను దీటుగా తిప్పిగొట్టగలిగే కావలి గ్రీష్మ వంటి యువత ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరించాలని, మహానాడు వేదికగా గ్రీష్మ ప్రసంగం అందుకు ఆరంభం మాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహానాడు వేదికగా గ్రీష్మ చేసిన ప్రసంగంతో ఆమె పార్టీకు పార్టీ క్యాడర్ లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. గ్రీష్మ.. ఖాళీ సమయాల్లో కరాటే, కర్రసాము సాధన చేస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/telugudesham-new-fire-brand-kavali-greeshma-25-136796.html





