అందరి చూపు టీడీపీ వైపు ..!
Publish Date:Jun 1, 2022
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిజానికి, రాష్ట్ర రాజకీయాలను దగ్గరగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంగా, రాష్ట్ర రాజకీయాలను కొత్త కోణంలో చూడవలసిన అవసరం ఉందని అంటున్నారు. ఓకే విధంగా చూస్తే ఇటీవల జరిగిన తెలుగు దేశం పార్టీ మహానాడు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిందని అంటున్నారు. అందుకే, ఇప్పుడు,మహానాడుకు ముందు మహానాడు తర్వాత అనే కొత్త కోణంలో రాష్ట్ర రాజకీయాలను చూడాలని విశ్లేషకులు అంటున్నారు. మరోవంక అధికార వైసీపీలో తాజా మాజీ మాజీ మత్రులు కేంద్ర బిందువుగా అనేక జిల్లాలో అసమ్మతి రాజుకుంటోంది. ముఖ్యమంత్రి సమీప బంధువు ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం కుతకుతలాడి పోతున్నారంటే, ఇక మిగిలినవారి సంగతి చెప్పనక్కర లేదు. నిజానికి మాజీ మంత్రులే కాదు, కొట్లాడి పదవులు నిలుపుకున్న సీనియర్ మంత్రులు కూడా హ్యాపీ’గా లేరని, పేరుకు మంత్రులే అయినా క్రింది స్థాయి అధికారులు కూడా తమకు గౌరం ఇవ్వడం లేదని అంటున్నారు. అందుకే,ఎవరికి వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. అలాగే, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక రాజకీయ ఫ్యామిలీగా గుర్తింపు పొందిన ఆనం ఫ్యామిలీ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి మహానాడు సందర్భంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. నిన్న మొన్నటి వరకు ఆనం రామనారాయణరెడ్డితో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కైవల్యారెడ్డి ఒక్కసారిగా టీడీపీ మహానాడు సందర్భంగా భర్త రితేశ్ రెడ్డితో కలిసి ఒంగోలు వెళ్లి లోకేశ్ తో భేటీ అయ్యారు. నిజానికి, ఆనం రామ నారాయణ రెడ్డి కూడా చాలా కాలంగా ,వైసీపీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ పనితీరును, వైసేపీ నేతల ప్రవర్తనను తప్పు పడుతున్నారు. మరో వంక ఆనం ఫ్యామిలీ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె, అల్లుడు టీడీపీ అగ్రనేత లోకేష్’ను కలవడమే కాకుండా, టీడీపీ అవకాశం ఇస్తే, ఆత్మకూరు ఆత్మకూరు ఉపఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా ఆమె సంసిద్ధత వ్యక్త పరిచారు. సో ..ఆనం ఫ్యామిలీ టీడీపీ రీఎంట్రీ కూడా ఖరారైనట్లే అంటున్నారు. అదే విధంగా, 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు, సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సహా మరి కొందరు ముఖ్యనేతలు, మళ్ళీ స్వగృహ ప్రవేశానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇంత కాలం పార్టీలో ఉన్నారా లేరా అన్నట్లున్న మాజీ మంత్రి విశాఖ ఎమ్మెల్యే గంట శ్రీనివాస రావు,కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిజానికి,. మాజీ టీడీపీ నేతలే కాదు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా, టీడీపీ వైపు చూస్తున్నారు. వైసీపీని ఓడించే శక్తి ఒక్క తెలుగు దేశం పార్టీకి మాత్రమే ఉందని, అందుకే, వైసీపీ వ్యతిరేకులు అందరి చూపు టీడీపీ వైపు .. అన్నట్లుగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారుతోందని పరిశీలకులు అంటున్నారు.
అదలా ఉంటే, కారణాలు ఏవైనా గత కొంత కాలంగా కొంత మేర స్థబ్దుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలలో మహానాడు నూతన ఉత్సాహాన్ని నింపింది. మహానాడు తర్వాత పడి లేచిన కెరటంలా తెలుగు దేశం పార్టీలో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీ పూర్వ వైభవం పొందుతుందనే విశ్వాసం పార్టీలో, నాయకుల్లో ఏర్పడింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నట్లుగా, ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయని, అందులో సందేహం లేదన్న విశ్వాసం సర్వత్రా వ్యకమవుతోంది.
అంతే కాదు, ఇంతవరకు ఇతర పార్టీలలో ఉన్న వైసీపీ శక్తులు, నాయకులు ఇప్పుడు తెలుగు దేశం వైపు చూస్తున్నారు. అలాగే, ఇంత వరకూ అదికార పార్టీ వైపు చూస్తున్న టీడీపీ నేతలు, ఇప్పు మళ్ళీ తెలుగు దేశం వైపు చూస్తున్నారు. తెలుగు దేశం పార్టీ టికెట్ పై గెలిచి, వైసీపీతో అంటకాగిన, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే చెంపలేసుకున్నారు. చంద్రబాబు నాయుడు క్షమిస్తే తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు పంపుతున్నారు. బంతి ప్రస్తుతం చంద్రబాబు కోర్టులో వుంది.. ఆయన ఊ.. అంటే వంశీ టీడీపీ రీఎంట్రీకి రెడీగా ఉన్నారు.
http://www.teluguone.com/news/content/all-parties-looking-at-tdp-25-136800.html





