ఆర్టీసీ కార్మికుల నెత్తిన మరో పిడుగు... ఇక ఆ దేవుడే కాపాడాలి..!
Publish Date:Nov 23, 2019
Advertisement
ఆర్టీసీ కార్మికుల నెత్తిన మరో పిడుగుపడింది. 50రోజులుగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో... చేతులెత్తేసిన ఆర్టీసీ జేఏసీకి మరో భంగపాటు ఎదురైంది. 50శాతం ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె విషయంలోనూ, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపైనా మొదట్లో ప్రభుత్వంపై నిప్పులు చెరిగి కార్మికుల్లో లేనిపోని ఆశలు రేపిన హైకోర్టు... ఆఖర్లో మాత్రం తుస్సుమనిపించింది. ప్రభుత్వం స్పందించకపోయినా, తమను హైకోర్టు ఆదుకుంటుందని, కనీసం తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని ఆశపడ్డారు. కానీ, ఆర్టీసీ సమ్మె విషయంలో తాము ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలివ్వలేమని చేతులెత్తేయడంతోనే ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ దిశగా నిర్ణయం తీసుకుంది. ఇక, ఇప్పుడు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విషయంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో కార్మికుల గుండెల్లో గునపాలు దిగినట్లయ్యింది. దాంతో, ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇక, ప్రభుత్వం ఎప్పుడు పిలుస్తుందా? ఎప్పుడు విధుల్లో చేరదామా అంటూ ఆర్టీసీ కార్మికులు డిపోల దగ్గర పడిగాపులు పడుతున్నారు. అయితే, షరతులతో కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకున్నా, దాదాపు 50శాతం రూట్ల ప్రైవేటీకరణ కారణంగా దాదాపు పాతికవేల మంది కార్మికులను ఆర్టీసీలో కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి, వీళ్లందరినీ ప్రభుత్వం ఆర్టీసీలోనే కొనసాగిస్తుందా? లేక ఇతర కార్పొరేషన్లకు బదిలీ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే, 5100 ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేయడంతో సుప్రీంను ఆశ్రయించాలని పిటిషనర్ విశ్వేశ్వర్రావు నిర్ణయించారు. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 102 ప్రకారం... ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయన్న హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేయనున్నారు. అసలు, టీఎస్-ఆర్టీసీకే చట్టబద్ధత లేదంటోన్న విశ్వేశ్వర్రావు.... 50శాతం రూట్లను ప్రైవేటీకరణ చేస్తే... ఆర్టీసీ కార్మికులు ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత దూకుడుగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/telangana-high-court-allows-privatisation-of-bus-routes-39-91501.html