టీడీపీలో మొదలైన ఎన్నికల కోలాహలం... సంస్థాగత ఎన్నికలకు కసరత్తులు
Publish Date:Nov 23, 2019
Advertisement
తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికల కోలాహలం మొదలైంది. ముందుగా గ్రామ స్థాయి కమిటీలతో మొదలు పెట్టి, జిల్లా స్థాయి వరకు ఎన్నికల నిర్వహణకు పార్టీ కసరత్తులు ప్రారంభించింది. ప్రతి రెండేళ్లకు నియమబద్ధంగా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్న టిడిపి ఈ సారి కొంత ఆలస్యంగా దీన్ని చేపట్టింది. ఎన్నికల్లో అనూహ్య ఓటమి టిడిపి శ్రేణుల్లో స్తబ్దత తెచ్చింది. కిందిస్థాయిలో కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఆ స్తబ్దత పోయేలా కొత్త వారిని ఎంపిక చేసి పార్టీ కార్యకలాపాలు నిర్వహించటానికి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మంచి అవకాశమని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల ( నవంబర్ ) 18 నుంచి గ్రామ స్థాయి పార్టీ కమిటీల ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టారు. పదమూడు జిల్లాలల్లో కలిపి సుమారు 16,000 ల గ్రామ కమిటీలను నియమించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి మండలానికి ముగ్గురు సభ్యుల పార్టీ బృందాలను నియమించారు. స్థానిక రాజకీయాల ప్రభావం వారిపై పడకుండా చూసేందుకు పొరుగు మండలాల వారిని ఈ బృందాల్లో నియమించారు. ఈ సారి ఈ కమిటీల నియామకంలో మార్పులు చేర్పులు చేశారు. గతంలో కేవలం పార్టీ కమిటీ ఎన్నిక మాత్రమే గ్రామ స్థాయిలో జరిగేది. ఈ దఫా కిందినుంచి అనుబంధ సంఘాలను బలోపేతం చేసే నిమిత్తం అదనంగా మూడు కమిటీలను కూడా ప్రతి గ్రామంలో నియమించాలని అధిష్టానం ఆదేశించింది. దీని ప్రకారం ప్రతి గ్రామంలో తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు కమిటీల్లో కూడా నియమించాల్సి వుంటుంది. గ్రామ కమిటీల నియామకంలో ఎక్కడా సిఫారసులు నామినేషన్ కు అవకాశం ఇవ్వొద్దని ఆ గ్రామంలో పార్టీ సభ్యులందరి అభిప్రాయం తీసుకొని ఆ ప్రకారం కమిటీ ఎంపిక జరగాలని సూచించారు. అవసరమైతే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించి కమిటీనీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలే కానీ తమపై రుద్దద్దని.. అభిప్రాయభేదం ఇవ్వొద్దని.. అధిష్టానం ఆదేశించింది. కమిటీల కూర్పులో కూడా భారీగా మార్పులు చేశారు. కమిటీలోని మొత్తం పదవుల్లో ఖచ్చితంగా సగం బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ వర్గాల వారికి ఇవ్వాలని ఆదేశించారు.కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవుల్లో ఒకటి తప్పని సరిగా బీసీలకు ఇవ్వాలని వారు అందుబాటులో లేకపోతే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చాన్స్ ఇవ్వాలని అధిష్టానం నిర్దేశించింది. పదవుల్లో కచ్చితంగా 33 శాతం యువత ఉండాలని 33 శాతం పదవుల్లో మహిళలు కూడా ఉండేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. యువత మహిళలకు కమిటీల్లో తగిన ప్రాధాన్యం ఉంటే కొత్త నాయకత్వం ఎదుగుదలకు అవకాశం ఏర్పడుతుందని, దానివల్ల కొత్త నీరు వస్తుందని పార్టీ నాయకత్వం ఆశిస్తోంది. గ్రామ స్థాయి ఎన్నికల తర్వాత మండల కమిటీల ఎన్నికలను చేపట్టనుంది. మండల స్థాయి వరకూ ఎన్నికలను డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. గ్రామ స్థాయి ఎన్నికలు జరుగుతున్న తీరును టిడిపి అధినేత చంద్రబాబు నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామానికి వెళ్లకుండా ఎక్కడో కూర్చొని కమిటీల పేర్లు రాస్తే ఊరుకునే సమస్యే లేదని పార్టీ పరిశీలకులు ఖచ్చితంగా ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడే కమిటీ ఎన్నిక జరపాలని ఆదేశించారు. కమిటీల ఎన్నికలో ఉత్సాహంగా కింది స్థాయి నేతలు పాల్గొంటున్నారని.. స్తబ్ధత వైదొలిగిన వాతావరణం కనిపిస్తోందని.. పార్టీ పరిశీలకులు నివేదించారు.
http://www.teluguone.com/news/content/tdp-samsthaagata-ennikala-kasarattu-39-91503.html