కేసీఆర్ అంచనాలకు అందడు..
Publish Date:Apr 21, 2016
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..రాజకీయ వ్యూహాల్లో ఆయన్ను మించిన వారు లేరు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు పావులు కదిపి అనుకున్నది సాధిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీలను దాదాపుగా ఖాళీ చేసేశారు. తాజాగా మరో ప్రత్యర్థి కాంగ్రెస్ బలం తగ్గించేందుకు మరో కొత్త స్కెచ్ గీశారు. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ రాంరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల కన్నుమూశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబంలో ఎవరో ఒకరిని నిలబెట్టి ఎన్నికను ఏకగ్రీవం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ పద్థతి ప్రకారం రాంరెడ్డి సతీమణి సుచరితారెడ్డిని పోటీలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీనిని ఎకగ్రీవం చేయాలని భావించిన కాంగ్రెస్ ఆమె విజయానికి మిగతా పార్టీల సహకారం పొందాలని నిర్ణయించారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ పోటీ చేస్తుందని ప్రకటన వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఖంగుతింది. అదంతా ఒక ఎత్తైతే అభ్యర్థి ఎంపికలో సీఎం తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శాసనమండలి సభ్యుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దించాలని కేసీఆర్ వ్యూహం పన్నారు. అనారోగ్యంతో ఫాంహౌస్‌లో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఉపఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. జిల్లాలో పట్టు, బలమైన అనుచర వర్గం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పాలేరుకు సరైన అభ్యర్థిగా కేసీఆర్ భావించి అక్కడ నుంచి పోటీ చేయాలని తుమ్మలను కోరారు. పాలేరు నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. 13 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీదే విజయం. అలాంటి చోట కాంగ్రెస్‌ను చావుదెబ్బకొట్టి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కేసీఆర్ వ్యూహం. నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నికలో కూడా తొలుత టీఆర్ఎస్ పోటీ చేయదని అందరూ అనుకున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్‌ని బరిలోకి దింపి నారాయణ్‌ఖేడ్‌ని కైవసం చేసుకున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ ఏకగ్రీవాలకు వరుసగా గండికొడుతూ హస్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నారు. నారాయణ్ ఖేడ్ లాగా టీఆర్ఎస్ పోటీ చేస్తుందేమోనని టీపీసీసీ నేతలు ముందుగానే సీఎంని ప్రసన్నం చేసుకోవాలని భావించి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరారు. కాంగ్రెస్ నేతలు ఎన్నిక ఏకగ్రీవం చేయాలని అడుగుతారని కేసీఆర్ ఊహించారు. అందుకే వాళ్లకి చెక్ పెట్టేందుకేఅయితే నిన్న రాత్రి దాకా తన అపాయింట్‌మెంట్ ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత టీపీసీసీ నాయకులు ఏకగ్రీవం గురించి ఆడగటానికి కూడా సాహసించబోరనే యోచనతోనే కేసీఆర్ అలా చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం షాక్‌కి కాంగ్రెస్‌కి మైండ్ బ్లాంక్ అయ్యింది. కేసీఆర్‌తో గేమ్స్ వద్దు.
http://www.teluguone.com/news/content/telangana-cm-kcr-45-58927.html





