ఉద్యమాలు చేస్తున్న స్పందించని ప్రభుత్వం కెసిఆర్
Publish Date:Jan 9, 2012
Advertisement
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న తోలుమందం ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆరోపించారు. తెరాస మహిళా విభాగం, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘాలు రూపొందించిన డైరీలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంత వరకు తమ పార్టీ విశ్రమించబోదన్నారు.అందుకే ఈనెల 18, 19వ తేదీల్లో తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఖరారు చేస్తామన్నారు. మళ్లీ సమ్మె చేయటానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ కోసం 800 మంది అశువులు బాసినా కేంద్రం స్పందించక పోవడం శోచనీయమన్నారు. ప్రజాభిప్రాయంపై కేంద్రానికి ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. తెలంగాణ సాధన పోరాటంలో మహిళలు, ప్రైవేట్ ఉద్యోగులు చురుగ్గా ముందుండాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే స్థానికులకే అన్ని రకాల ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఇకపోతే తెలంగాణ ఉద్యమం ఇతివృత్తంతో నిర్మించిన "జై తెలంగాణ" సినిమా ప్రదర్శనకు థియేటర్లు ఇవ్వకుంటే ఇతర ప్రాంతాలకు చెందిన సినిమాలను తాము అడ్డుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. తమ ప్రాంత వ్యక్తులు తీసే సినిమాలకు థియేటర్ల యజమానులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.తెలుగు చిత్ర పరిశ్రమనేకాకుండా తెలంగాణలోని థియేటర్లలోనూ సీమాంధ్ర పెట్టుబడిదారులే శాసిస్తున్నారని, ఒక్కరిద్దరి ఆధీనంలోనే వందల థియేటర్లు ఉన్నాయని మండిపడ్డారు. వాళ్ల సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇస్తూ మన సినిమాలకు ఇవ్వడం లేదన్నారు. దీన్ని సహించబోమన్నారు.థియేటర్లపై పిడికెడు మంది ఆంధ్రా నిర్మాతల ఏకస్వామ్యాన్ని ఎదిరిస్తామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.కాగా మహిళలను వంటింటికి పరిమితం చేయకుండా వారికి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరిశ్రమలలో స్థానికులకు తొంబై శాతం ఉద్యోగాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిశ్రమలను ప్రోత్సహిస్తూ వాటిల్లో తొంబై శాతం స్థానికులకే ఇస్తామన్నారు. తెలంగాణకు చెందిన ప్రైవేట్ ఉద్యోగులను వేధిస్తే వారి యాజమాన్యాల భరతం పడతామని, వెంటపడుతామని కెసిఆర్ హెచ్చరించారు. స్థానిక సంస్థలతోపాటు, చట్ట సభల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్నారు. మహిళా బిల్లు తీసుకొస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు.
http://www.teluguone.com/news/content/telangana-24-10766.html





