ఇక క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన సమష్టి పోరాటాలు!
Publish Date:Sep 26, 2023
Advertisement
తెలుగుదేశం, జనసేన మధ్య ఎన్నికల పొత్తు ఖరారైపోయింది. తరువాత అతి ముఖ్యమైన అంశం సీట్ల పంపకం. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు సీట్ల పంపకాలపై పొత్తు ప్రకటనకు ముందే ఇరు పార్టీల మధ్యా ఒక అవగాహన కుదిరింది. ఆ విషయంపై ఇరుపార్టీల అధినేతలూ సమష్టి ప్రకటనకు సిద్ధమౌతున్న సమయంలో అనూహ్యంగా చంద్రబాబు అరెస్టు అవ్వడంతో సమష్టి ప్రకటనకు అవకాశం లేకపోయింది. అందుకే చంద్రబాబుతో ములాఖత్ అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేశారు. అప్పటికే ఇరు పార్టీల మధ్యా సీట్ల పంపకాల విషయంలో ఒక అవగాహన కుదిరిందని చెబుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు రెండు పార్టీలూ దృష్టి పెట్టాల్సిన అంశం క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల క్యాడర్ కలిసి పనిచేయాలన్నదానిపైనే. ఇప్పుడు ఇరు పార్టీల నాయకులూ ఆ విషయంపైనే బిజీగా ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే.. ఇరు పార్టీల మధ్యా సమన్వయం విషయంలోనూ, సమష్టిగా ప్రజా సమస్యలపై గళమెత్తడంలోనూ పొత్తు ప్రభావం గట్టిగా కనిపించేలా పని చేయాల్సిన అవసరం ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఇప్పటికే తెలుగుదేశం, జనసేనలు కలిసి పని చేస్తున్నాయి. లోకేష్ యువగళం పాదయాత్రలో జనసేన జెండాలు కనిపించడం ఇందుకు తిరుగులేని సాక్ష్యం. అలాగే చంద్రబాబు పర్యటనల్లోనూ జనసేన పాలుపంచుకుంది. ఇరు పార్టీల మధ్యా పొత్తు ప్రకటన పవన్ కల్యాణ్ నోటి వెంట ఇటీవలే అధికారికంగా వచ్చినప్పటికీ, అంత కంటే ముందు నుంచే ఆరు పార్టీల మధ్యా పొత్తు విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది. ఇక సీట్ల పంపకం విషయంలో ఇరు పార్టీల మధ్యా కొంత ప్రతిష్ఠంభన ఉందన భావించడానికి అవకాశం ఇచ్చే కొన్ని ప్రకటనలు ఇరు పార్టీల నుంచీ గతంలో వచ్చినప్పటికీ.. ఇప్పటికే సీట్ షేరింగ్ విషయంలో ఇరు పార్టీల అధినేతలూ ఒక అవగాహనకు వచ్చారనీ, సమస్యలేమీ తలెత్తకుండానే ఇరు పార్టీల అధినేతలూ ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలన్న విషయంలో ఒక స్పష్టత కు వచ్చారనీ ఇరు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఆ వర్గాల సమాచారం మేరకు పాతిక అసెంబ్లీ స్థానాలలోనూ, మూడు లోక్ సభ స్థానాలలో జనసేన, మిగిలిన స్ధానాలలో అంటే 150 అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం పోటీలో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన అవసరం ఏమిటంటే.. ఒకవేళ బీజేపీ కూడా ఈ కూటమితో కలిస్తే పరిస్థితి ఏమిటన్నది? పొత్త ప్రకటన సమయంలోనే జనసేనాని విస్పష్టంగా బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్నికలలో పోటీ చేస్తామన్నారు. అంటే బీజేపీ కలిసి వచ్చే అవకాశం లేదన్న విషయంలో రెండు పార్టీలకూ అప్పటికే ఒక స్పష్టత ఉందని భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక వేళ బీజేపీ చివరి నిముషంలో కలిసి వస్తామని చెప్పినా, ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న స్టేక్ ను పరిగణనలోనికి తీసుకుని ఒకటి రెండు అసెంబ్లీ స్థానాలను సర్దుబాటు చేసే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. స్టేక్ ను మించి బీజేపీ డిమాండ్ చేస్తే బీజేపీని దూరం పెట్టి ఈ రెండు పార్టీలే కలిసి ఎన్నికల బరిలో జగన్ పార్టీని ఢీ కొనేందుకు ఒక నిర్ణయానికి వచ్చేశాయని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/tdp-janasena-united-programmes-inground-level-25-162378.html





