బాబుయాత్ర జరిగి తీరుతుంది స్పష్టం చేసిన కడియం
Publish Date:Jan 3, 2012
Advertisement
వరంగల్: జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోరు బాటయాత్రకు ముందే టిడిపి, టిఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. బాబు యాత్ర అడ్డుకుంటే ఊరుకునేది లేదని టిడిపి, తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాక యాత్ర చేయాలని టిఆర్ఎస్ పట్టుబడుతోంది. బాబు యాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరుతుందని టిడిపి నేత కడియం శ్రీహరి స్పష్టం చేశారు. టిడిపి, టిఆర్ఎస్ కలిసి ఉద్యమిస్తేనే కాంగ్రెసు దిగొస్తుందని అప్పుడు తెలంగాణ వస్తుందన్నారు. లేదంటే కాంగ్రెసుకు లబ్ధి చేకూరుతుందన్నారు. బాబు పర్యటన అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులు కాలరాయడమేనన్నారు. పోరుబాటలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా దానికి టిఆర్ఎస్, జెఏసియే బాధ్యత వహించాలన్నారు. కోదండరామ్ది టిఆర్ఎస్ అజెండా అన్నారు. తెలంగాణ ముసుగులో టిఆర్ఎస్ టిడిపిని బలహీనపర్చాలని చూస్తోందన్నారు. మరోవైపు టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బాబు యాత్ర సందర్భంగా ఈ నెల 6న వరంగల్ జిల్లా బందుకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. బాబు తన స్పష్టమైన వైఖరి చెప్పాకే తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు. పత్రికల ప్రకటనలు చూసి తెలంగాణవాదులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఉప ఎన్నికలు రిఫరెండం కాదన్న సిఎం వ్యాఖ్యలతో తెలంగాణలో కాంగ్రెసు చేతులెత్తేసిందనడానికి నిదర్శనమన్నారు. ఎన్నికల్లో సమైక్యవాదులకు బుద్ధి చెబుతారన్నారు.
http://www.teluguone.com/news/content/tdp-24-10559.html





