టీటీడీ ఈవో శ్యామలరావుపై,జేఈవో వెంకయ్య చౌదరిపై బదిలీ వేటు?
Publish Date:Jan 10, 2025
Advertisement
తప్పొప్పులకు బాధ్యత ఎవరిది అన్న విషయాన్ని పక్కన పెడితే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఎంత కాదనుకున్నా ప్రభుత్వ ప్రతిష్ఠను ఒకింత మసకబార్చింది. కూటమి పార్టీలలో కూడా తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎవరి వాదన వారిదన్నట్లుగా కనిపిస్తోంది. తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు ఒకే రోజు తిరుపతిలో పర్యటించిన తెలుగుదేశం, అధినేత ముఖ్యమంత్రి, జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు తమదైన శైలిలో ఘటనపై స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకునే విషయంలో అధికారుల కంటే ప్రత్యక్ష సాక్షులు, ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి సమాచారం తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సంఘటనకు బాధ్యులు ఫలానా వారని చెప్పకుండానే.. మీడియా సమక్షంలోనే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ లోపం ఎందుకొచ్చిందని నిలదీశారు. ఎస్పీపై అయితే ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పద్ధతి మార్చుకోరా? ఏం తమాషాగా ఉందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరో వైపు పవన్ కల్యాణ్ తిరుపతి తొక్కిసలాటకు బేషరతు క్షమాపణలు చెప్పారు. బాధితులను ఆదుకుంటామనీ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామనీ చెబుతూనే.. టీటీడీలో వీఐపీ యాటిట్యూడ్ మారాలని కుండబద్దలు కొట్టారు. ఈ ఘటనకు ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిల మధ్య సమన్వయ లోపమే కారణమని ఎత్తి చూపారు. అలాగే పోలీసుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కొందరు పోలీసులు బాధ్యతగా వ్యవహరించినా, కొందరు మాత్రం తొక్కిసలాట సమయంలో ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. ఇక పోతే తిరుపతి తొక్కిసలాటకు ఎవరు కాదన్నా, ఔనన్నా బాధ్యత వహించాల్సింది మాత్రం తిరుమల తిరుపతి దేవస్ధానమే. టీటీడీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న సంగతి సీఎం సమీక్షలోనే ప్రస్ఫుటంగా బయటపడింది. ఆ సమీక్షలో ఏకంగా సీఎం ముందే టీటీడీ చైర్మన్, ఈవో శ్యామలరావులు వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఈవోపై చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరినీ మందలించారు. తొక్కిసలాట ఘటన అనంతరం ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేయీవో గౌతమిలపై ప్రభుత్వంబదిలీ వేటు పడింది. టీటీడీ చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి శ్రీధర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించానే కారణంతో ఆయననూ బదిలీ చేశారు. ఇక ప్రాథమిక నివేదికలో తొక్కిసలాటకు కారణం డీఎస్పీ రమణ బాబు అన్న కలెక్టర్ నివేదికతో ఆయనను సస్పెండ్ చేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. అయితే తొక్కిసలాట ఘటనకు సంబంధించి మరింత మందిపై చర్యలు ఉంటాయన్న చర్చ కూడా జరుగుతోంది. మరీ ముఖ్యంగా టీటీడీ చైర్మన్ లో సమన్వయం లేకుండా వ్యవహరించిన ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిలపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భక్తుల సౌకర్యాలు, భద్రత కంటే తమ సొంత ఇగో శాటిస్ ఫ్యాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న భావన టీటీడీ పాలకమండలి సభ్యుల నుంచి బలంగా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వారిరువురిపై కూడా బదలీ వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు.
టీటీడీ చైర్మన్, ఈవో శ్యామలరావుల మధ్య సమన్వయం లేదన్న వార్తలు గత కొంత కాలంగా బలంగా వినిపిస్తున్నాయి. పాలకమండలి సభ్యులే ప్రైవేటు సంభాషణల్లో పలు మార్లు ఈ విషయంపై చర్చించుకున్నారు. ఆ కారణంగానే వైకుంఠ ద్వార దర్శనం టోకోన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. టోకెన్ల జారీ కేంద్రం తలుపులు ఎప్పుడు తెరవాలి, పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను ఎలా నియంత్రించాలి అన్న దానిపై ఎవరికి తోచినట్లు వారు ప్రకటనలు చేయడంతో, ఈ విషయంలో పనుల పరిశీలన, సమీక్షల్లో కూడా ఎవరి దారి వారిదే, ఎవరిగోల వారిదే అన్నట్లుగా సాగడంతో కింది స్థాయి అధికారులలో గందరగోళం ఏర్పడిందంటున్నారు.
http://www.teluguone.com/news/content/suspension-axe-on-eo-syamalarao-and-jeo-venkayya-chaudary-25-191144.html