తాయిలాలతో ప్రజలను ఏమార్చిన ఫలితం..!
Publish Date:Jun 5, 2022
Advertisement
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక స్థితికి ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. ఉత్పాదక అంశాలపై దృష్టి సారించకుండా.. ప్రజలకు అవసరమా కాదా అన్న విచక్షణ కూడా లేకుండా కులాలు, మతాల వారీగా నిధుల పందేరం జరిగేలా పథకాలు రూపొందించి అమలు చేసిన ఫలితమే ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కారణమని రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రస్తుత ఆర్థిక దుస్థితికి కేసీఆర్ పాలనా విధానాలే కారణం. ఆవిర్భావంతోనే మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణ నేడు సకాలంలో ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇవ్వడానికి అప్పుల మీద ఆధారపడాల్సిన దుస్థితికి చేరుకోవడానికి తాయిలాల పాలనే కారణం. తాయిలాల ప్రలోభంలో పడి జనం తమ ప్రగతికి, అభివృద్దికి, వికాసానికి హేతువుగా నిలిచే విద్య, ఉపాధి, నైపుణ్యం వంటి ప్రధానమైన విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీయడం విస్మరించడమే కారణం. అధికారంలో ఉండి.. ఐదేళ్ల తరువాత మళ్లీ అధికారం అన్న లక్ష్యం వినా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం, ప్రజల భవిష్యత్ బంగారంలా ఉండేందుకు అత్యంత కీలకమైన వైద్య రంగాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలను పట్టించుకోని ప్రభుత్వమూ కారణం. అంటే మొత్తంగా తెలంగాణ ఆర్థిక సంక్షోభానికి పాలకులూ, ప్రజలూ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ఒక సదాశయంతో ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమ సారథిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజయవంతం చేయగలిగారు. అయితే అధకారం చేపట్టిన తరువాత ఉద్యమ ఆశయాలను నెరవేర్చడంలో మాత్రం విఫలమయ్యారు. ఉద్యమ ఫలితాలను తెలంగాణ సమాజానికి అందించడంలో విఫలమయ్యారు. రాష్ట్రం సాకారమైతే జనం ఏవైతే తమకు లభిస్తాయని ఆశించారో అవి మాత్రం జనాలకు అందలేదు. అసలా దిశగా పాలన సాగింది లేదు. తెలంగాణ రాష్ట్ర సాకారానికి జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ పార్టీయే గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ ఉద్యమ సారథే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆవిర్భావమే మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన తెలంగాణ నేడు లోటులో పీకలోతు మునిగిపోయింది. చిన్న చిన్న బిల్లుల చెల్లింపు నుంచి ఉద్యోగుల వేతనాల వరకూ అప్పులే శరణ్యమనే పరిస్దితికి వచ్చింది. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి సైతం అప్పలు తప్ప మరో గత్యంతరం లేని దుస్థితికి చేరుకుంది. కేవలం తాయిలాలకే సింహభాగం ఖర్చు చేస్తూ అత్యంత కీలకమైన, ప్రధానమైన రంగాలను విస్మరించడమే ఇందుకు కారణం. మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కేవలం ఎనిమిది సంవత్సరాలలో కనీస చెల్లింపులు చేయలేని పరిస్థితికి ప్రాధాన్యం లేని, ఉత్పాదకతకు పనికిరాని వ్యయాలను విపరీతంగా పెంచుకుంటూ పోవడం, వాటికి నిధుల కేటాయింపు ఒక ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. కులాలు మతాల వారీగా కేటాయింపులు కచ్చితంగా ఒక ప్రధాన కారణం. ఓట్లను రాల్చే, ప్రజాకర్షక పథకాలే పాలనా విధానంగా మారిపోవడం మరో ముఖ్యమైన కారణం. దీని వల్ల ఇప్పుడా పథకాలే ప్రభుత్వానికి గుదిబండగా మారిన సంగతి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ప్రతి విషయాన్నీ కేంద్రం మీదకు నెట్టేసి రాజకీయ పబ్బం గడుపుకోవడంతోనే తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది కానీ, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సినది మాత్రం చేయడం లేదు. అందుకే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నా కూడా రాజకీయ వేడి రగిల్చి ప్రజల దృష్టి మరల్చడానికే ఇప్పటికీ ప్రాధాన్యత ఇస్తున్నది. ఓట్లు రాల్చే పథకాలతో ఎల్లకాలం ప్రజాభిమానాన్ని చూరగొనడం సాధ్యం కాదనడానికి ఇప్పుడు రాష్ట్రంలో వ్యక్తమౌతున్న ప్రభుత్వ వ్యతిరేకతే నిదర్శనం
http://www.teluguone.com/news/content/surplus-state-tekangana-in-financial-25-137080.html





