మద్యానికి బానిస.. ఈ కోడి రూటే సెపరేట్
Publish Date:Jun 5, 2022
Advertisement
అందరిదీ ఒక దారైతే నాది మాత్రం వేరే దారి అనేలా ప్రవర్తించే వాళ్లుంటారు. నలుగురూ నడిచే దారిలో నడిస్తే నా స్పెషాలిటీ ఏంటి అంటూ మిగిలిన వారికి భిన్నంగా ప్రవర్తిస్తూ గుర్తింపు పొందేవారూ ఉంటారు. పదుగురు నడిచే దారిలో నడిస్తే నా గొప్పేమిటి అంటూ ఒకింత ఎబ్బెట్టుగా అనిపించినా డిఫరెంట్ లుక్ కోసం చిత్ర విచిత్ర వేషాలు వేసే వారూ ఉంటారు. అయితే ఈ రకమైన భిన్నత్వాన్ని కోరుకునే వారు మనుషుల్లోనే ఉంటారనుకోవడం సరికాదు. జంతువుల్లోనూ, పక్షుల్లోనూ కూడా ఇలాంటి ‘ప్రత్యేక’ జాతి ఉంటుంది. అందుకు ఈ కోడే ఉదాహరణ. మామూలుగా ఓ కోడి ఏం చేస్తుంది. నేలపై గింజలేరుకు తింటుంది. వాటినే విసర్జిస్తుంది. పుంజు అయితే తెల్లారగానే ఊరంతటినీ నిద్రలేపేందుకు కొక్కొరోకో అంటూ గట్టిగా అరుస్తుంది. పెట్ట అయితే గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను ఎగరలేని తన రెక్కల కింద భద్రంగా కాపాడుకుంటుంది. కానీ మహారాష్ట్రలో ఓ కోడి మాత్రం మందుకు బానిసైంది. నిజమే. నిత్యం తాగితే కాని ఉండలేని కొందరు మందుబాబులకే బాబు అన్నట్లుగా ఈ కోడి ప్రవర్తన ఉంటోంది. మహారాష్ట్రలో పిప్రికి గ్రామంలో భావుకాతొరే అనే వ్యక్తికి కోళ్ల పెంపకంపై మక్కువ. ఆ మక్కువతోనే పలు రకాల కోళ్లను పెంచుతుంటాడు. అలా అతడి వద్ద నున్న కోళ్లలో ఓ పుంజు మాత్రం సెపరేట్ స్టైల్ మెయిన్టైన్ చేస్తోంది. మిగిలిన కోళ్ల మాదిరిగా వేసింది తిని తొంగోవడం లేదు. మందు ఉంటే తప్ప మొతుకు ముట్టను అంటోంది. ఏం మనుషులకేనా..మాకు మాత్రం అలవాట్లుండవా?, వ్యసనాలుండవా అంటూ కొక్కొరోకో అంటూ నిలదీస్తోంది. ప్రతి రోజూ టైం ప్రకారం ఈ కోడికి మందు పడాల్సింది. అదీ ఒకే బ్రాండ్ ఎంహెచ్ బ్రాందీ. పడాల్సిన రెండు పెగ్గులూ పడకపోతే.. ఆ కోడి నిరాహార దీక్ష చేస్తుంది. ఈ విషయంలో ఈ కోడి గాంధీ శిష్యురాలు అని చెప్పొచ్చు. మందు పడకుంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే ముక్కుతో చిన్న బియ్యం గించను కూడా ముట్టదు. నీరు తాగదు. దీంతో చేసేదేం లేక ఆ కోడి యజమాని రోజు మద్యం కొని దానికి పడుతున్నాడు. అసలీ కోడి మద్యానికి బానిస అవ్వడానికి కూడా ఓ కథ ఉందట. అదేమిటంటే కొన్నాళ్ల కిందట ఈ కోడికి జబ్బు చేసిందట. ఉలుకూ పలుకూ లేక పడుంటుంటే..పశువైద్యుడి వద్దకు తీసుకువెళితే కొన్ని రోజులు కొద్దిగా మద్యం పట్టమని చెప్పాడట. పాపం ఆ యజమాని అదే చేశాడు. కోడి జబ్బునుంచి కోలుకుంది. ఇక అప్పట్నుంచీ మొదలైంది దాని హడావుడి. మందు పడితేనే అది కోడి. లేకపోతే కాదు. అంతలా మద్యానికి బానిసైపోయింది. మద్యం తాగే కోడి గురించి ఈ నోటీ ఈనోటా విని చూడడానికి తండోపతండాలుగా జనం రావడం మొదలైంది. దీంతో పిప్రికి గ్రామం ఓ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. కోడికీ కోడి యజమానికీ కూడా బోల్డంత గుర్పింపు వచ్చేసింది.
http://www.teluguone.com/news/content/hen-edicted-to-drug-25-137063.html





