బెజవాడ నడిబొడ్డులో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
Publish Date:Jan 11, 2026
Advertisement
విజయవాడ లెనిన్ సెంటర్‌లో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, హీరో జయ కృష్ణ, గద్దె రామ్మోహన్, బోండా ఉమా, బుద్ధ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. కృష్ణని చూస్తే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తుంటారని, విజయవాడ నడిబొడ్డులో కృష్ణ విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు కృష్ణ పేరు నిలిచి ఉంటుందన్నారు. కృష్ణతో ప్రతి ఒక్క హీరోకి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. మూవీ పోస్టర్‌ను చూసి ఆయా సినిమాలకు వెళ్లామంటే అది ఒక కృష్ణకే దక్కుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. హీరో కృష్ణను మించిన సూపర్ స్టార్ మరొకరు ఉండరని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అతి తక్కువ కాలంలో 350 సినిమాలు చేసిన గొప్ప నటుడు కృష్ణ అని ప్రశంసించారు. మూడో తరం వారసుడిగా రమేశ్‌బాబు కొడుకు జయకృష్ణ వస్తున్నారని తెలిపారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ బ్యానర్‌లో జై కృష్ణ నటించడం చాలా సంతోషంగా ఉందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. కృష్ణకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నటుడు మహేశ్‌బాబు లాగే.. కృష్ణ మనువడు జై కృష్ణ కూడా సూపర్ స్టార్ తరహాలో పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. ఈనాడు సినిమా ఇక్కడే షూటింగ్ జరిగిందని గుర్తుచేశారు. ఈనాడు సినిమా ద్వారా కృష్ణ రాష్ట్ర రాజకీయాల చరిత్రనే మార్చేశారని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/superstar-krishna-statue-unveiling-36-212378.html





