విశాఖ పోలీసుల పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు
Publish Date:Jan 11, 2026
Advertisement
విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రెండు రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్‌లో ఓ వ్యక్తి దాడి చేసి, దుర్భాషలాడినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు... ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది. సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి, వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నిందితుడి గుర్తింపు వివరాలు తెలియకపోయినా, కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని చెప్పారు. సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు. అలాగే నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. విశాఖలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్‌లోనూ ఎటువంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇదే సమయంలో ఇలాంటి ఘటనలపై రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-36-212381.html





