ప్రత్యేక ప్యాకేజ్ కి ఓకే అంటోన్న... 'ఆ నలుగురు'!
Publish Date:Sep 5, 2016
Advertisement
ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేందుకు రెడీ అయిన కేంద్రం ఆ దిశగా చకచకా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది! హోదా తప్ప ఏదీ వద్దని ఒకవైపు ఆంధ్రప్రదేశ్ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నా ఢిల్లీ పెద్దలు వాటిని పట్టించుకున్నట్టు కనిపించటం లేదు! అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్యాకేజ్ తప్ప అంతకంటే ఎక్కువ మోదీ సర్కార్ నుంచి ఆశించటం అత్యాశే అవుతుంది. ఎందుకంటే, ఆర్దిక సంఘం సిఫారసుల కారణంగా ఇక పై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కే సూచనలు కనిపించటం లేదు. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కు కూడా ఇందుకు మినహాయింపు కాదు...
ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఆంధ్రాను బుజ్జగించాలని ప్లాన్ వేసిన కేంద్రం అటుగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూడా. కేంద్ర ఆర్దిక మంత్రి తాను ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తే ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత కంటే ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స్పందనలను లెక్కలోకి తీసుకుంటున్నారు. అందుకే, జైట్లీ ఇప్పటికే అనేక రాష్ట్రాల సీఎంలతో మాట్లాడరని సమాచారం. నవ్యాంధ్రకు ప్యాకేజ్ ఇస్తే అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం వున్న అందరితో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎలాంటి షరతులు లేకుండా ఏపీని ఆదుకోవాలని కేంద్రానికి సూచించారంటున్నారు. విభజన సమయంలో చెప్పినట్టు చేయాల్సిందేనని దీదీ అన్నారట. ఇక ఏపీకి బార్డర్ స్టేట్ అయిన తమిళనాడు సీఎం మాత్రం ప్యాకేజ్ ఇస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటూనే పారిశ్రామిక రాయితీలు మాత్రం వద్దన్నారట. అలా చేస్తే తమ రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు ఏపీకి వెళ్లిపోతాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారట. ఈ భయం తమిళనాడుకు ముందు నుంచీ వుంది.
బీహార్ సీఎం నితీష్ ని జైట్లీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్నట్టు సమాచారం. ఎందుకంటే, బీహార్, ఒడిశా రాష్ట్రాలు ఆంధ్రాకు ప్రత్యేక హోదా అన్నప్పుడల్లా తమకూ ఇవ్వాలని పట్టుబడుతు వస్తున్నాయి. అయితే, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో మాత్రం బీహార్, ఒడిశా రాష్ట్రాలు అడ్డుపడలేదు. నితీష్ కుమార్ ఆంధ్రాకు ప్యాకేజ్ ఇవ్వాలని అంటే... ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పోలవరం మాత్రం కట్టటానికి వీలులేదని అన్నారు. ఆయన కూడా ప్యాకేజ్ కి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు...
ఈ చర్చలు , కేంద్రంలో వచ్చిన ఈ వేగం చూస్తుంటే ఏపీకి స్పెషల్ ప్యాకేజ్ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే అర్థమవుతోంది. అయితే, అన్ని రాష్ట్రాల్ని అడిగి తెలుసుకున్న జైట్లీ ఏపీకి దాయాది రాష్ట్రం అయిన తెలంగాణను అభిప్రాయం అడిగినట్టు వినిపించటం లేదు. ఏపీకి ప్యాకేజ్ ప్రకటిస్తే తెలంగాణ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి...
http://www.teluguone.com/news/content/andhra-pradesh-special-status-45-66077.html





