దెబ్బలు తిని హీరోనయ్యా.. గుప్తా ది లీడర్..
Publish Date:Jan 7, 2022
Advertisement
సుబ్బారావు గుప్తా. ఏపీలో ఇప్పుడు ఈ పేరు తెలీని వారు ఉండకపోవచ్చు. వైసీపీలో ఉంటూ.. వైసీపీ నేతలతో దెబ్బలు తిని ఓవర్‌నైట్ హీరో అయ్యారు. ఇప్పుడు రెబల్ వాయిస్ వినిపిస్తూ.. రఘురామలా సొంత ఇమేజ్ పెంచుకుంటున్నారు. ఒకప్పుడు ఒంగోలులో కొందరికి మాత్రమే తెలిసిన సుబ్బారావు గుప్తా.. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ది లీడర్ అయ్యారంటున్నారు. వైసీపీపై, జగన్‌పై విమర్శలు చేశారు సుబ్బారావు గుప్తా. పార్టీనే, పార్టీ అధినేతనే అంటావా..అంటూ ఎంపీ బాలినేని అనుచరుడు, రౌడీషీటర్ అయిన సుభానీ.. సుబ్బారావు గుప్తాపై దాడి చేశాడు. మోకాళ్లపై నిల్చోబెట్టి.. క్షమాపణలు చెప్పించారు. ఆ వీడియో తెగ వైరల్ అయింది. కట్ చేస్తే.. ఆ మర్నాడే ఎంపీ బాలినేని.. సుధాకర్ గుప్తాను తన ఇంటికి పిలిపించుకుని.. అయిందేదో అయింది.. మనం మనం ఒకటేనంటూ.. కేక్ కట్ చేసి.. గుప్తా నోట్లో పెట్టారు. ఆ ఎపిసోడ్ అక్కడితో ముగిసి పోతుందనుకున్నారు. కానీ, సుబ్బారావు గుప్తాపై దాడి వ్యవహారంపై వైశ్య కమ్యూనిటీ ఆగ్రహంతో రగిలిపోయింది. ఇటీవల తమ జాతిరత్నం, మాజీ సీఎం, మాజీ గవర్నర్ రోశయ్య మరణిస్తే.. చివరి చూపు కూడా చూడని జగన్‌ను ఇప్పటికే వైశ్య వ్యతిరేకిగా భావిస్తోంది. అదే సమయంలో సుబ్బారావు గుప్తాను వైసీపీ నేతలు కొట్టడంపై మరింత మండిపడుతోంది. ఆ ఆగ్రహ జ్వాల చూసే.. ఆర్థికంగా కీలకమైన వైశ్యులు పార్టీకి దూరమైతే ప్రమాదమని భావించే.. ఎంపీ బాలినేని దిగొచ్చారని అంటున్నారు. అయితే, ఎంపీ దిగొచ్చినా.. సుబ్బారావు గుప్తా మాత్రం తగ్గేదేలే అంటూ మరింత యాక్టివ్ అయ్యారు. తనపై దాడి చేసిన వారిని.. అరెస్ట్ పేరుతో పోలీసులు రాచమర్యాదలు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారంటూ మండిపడుతున్నారు. ఆత్మాభిమానం బాగా దెబ్బతిన్న సుబ్బారావు గుప్తా.. తనపై జరిగిన దాడిపై పోరాటం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ తనకు మద్దతు కూడగడుతున్నారు. విజయవాడ వెళ్లి వంగవీటి రాధాతో సుబ్బారావు గుప్తా భేటీ అయి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అనంతరం, బెజవాడలోనే ఆర్య వైశ్య ఐక్యత సభ నిర్వహించారు. ఒంగోలులో చోట రాజన్, డీ గ్యాంగులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని.. అయినా, తనపై దాడి చేసిన వారిని శిక్షించకుండా.. వారితో క్షమాపణలు చెప్పించకుండా.. సీఎంను కలిసేదే లే అంటున్నారు సుబ్బారావు గుప్తా. మంత్రి బాలినేని అనుచరుడు సుభానీ తనను కొట్టి విలన్ అయ్యాడని.. సుభానీ చేతిలో దెబ్బలు తిని తాను హీరోని అయ్యానని.. స్వయంగా సుబ్బారావు గుప్తానే అంటున్నారు. వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహిస్తే గన్ మెన్‌లను పంపారని.. తనపై దాడి జరిగినా రక్షణ కల్పించడం లేదన్నారు. తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఒంగోలులో 300 మంది రౌడీ షీటర్లు ఉంటే తనకు 250 మంది టచ్‌లో ఉన్నారని సుబ్బారావు గుప్తా అన్నారు. ఇంతదాకా వచ్చాక ఇక తగ్గేదేలే అంటూ.. వైసీపీకి సవాల్ విసురుతున్నారు గుప్తా.. ది లీడర్.
http://www.teluguone.com/news/content/subbarao-gupta-become-popular-in-ap-politics-39-129794.html





