సోనియానే సుప్రీం లీడర్.. అందరి నోటా అదే మాట!
Publish Date:Oct 19, 2022
Advertisement
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ( అక్టోబర్ 19) న కౌంటింగ్ జరుగుతుంది. పోటీలో ఉన్న మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ లలో ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసు. అయినా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చెప్పినట్లుగా అందిరికీ తెలిసిందే అయినా, శంఖంలో పోసే వరకు ఆగితే పోయేదేమీ లేదు. అయితే ఇప్పడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది అసలు ప్రశ్నే కాదు. అయితే ఖర్గే కాదంటే (అనే ప్రశ్నే లేదని అంతరాత్మ ఘోషిస్తోంది) థరూర్. ఇద్దరిలో ఎవరు గెలిచినా పెద్దగా ఫరక్ పడదు. కానీ, ఇంచుమించుగా పాతికేళ్ళ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో గాంధీలు కాకుండా వేరొకరు కూర్చోవడం కాంగ్రెస్ నాయకులు చాలా మందికి, ఇదొక అనూహ్య వాస్తవం, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చును. అదలా ఉంటే కాంగ్రెస్ వ్యవహారాల్లో ఇకపై గాంధీలు (సోనియా, రాహుల్, ప్రియాంకా) పోషించే పాత్ర ఏమిటి? ఇప్పడు చాలా మందిలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వాదుల్లో ఉన్న సందేహం ఇది. అయితే అధ్యక్ష పదవిలో లేనంత మాత్రాన గాంధీలు కాంగ్రెస్ కు దూరమై పోతారనో, పార్టీలో వారి పలుకు బడి పెత్తనం పలచబడి పోతుందనో అనుకుంటే అది పొరపాటే అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఎవరి దాకానో ఎందుకు, అధ్యక్ష రేసులో ముందున్న మల్లికార్జున ఖర్గేనే ఎన్నికల్లో తాను గెలిస్తే పార్టీని ముందుకు తీసుకుపోయే విషయంలో గాంధీల సూచనలు, సలహాలు తప్పక తీసుకుంటానని స్పష్టం చేశారు. అంతే కాదు గాంధీల డైరెక్షన్ లో పనిచేయడం అవమానంగా భావించనని రిమోట్ కంట్రోల్ అని అవహేళన చేసినా పట్టించుకోనని ఖర్గే తేల్చి చెప్పారు. శశి థరూర్ అంత ఓపెన్ గా ఆ మాట అనక పోయినా గాంధీల నాయకత్వాన్ని కాదనలేమని అయితే అంగీకరించారు. అంతే కాదు గాంధీలను దూరంగా పెట్టి కాంగ్రెస్ అధ్యక్షుడు స్వతంత్రంగా పనిచేయడం అయ్యేపని కాదని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహించిన గాంధీల డిఎన్ఎనే కాంగ్రెస్ రక్తంలో ప్రవహిస్తోందని థరూర్ కాంగ్రెస్ పార్టీ ని గాంధీలను వేరు చేసే చూడలేమని తేల్చి చెప్పారు. అధ్యక్ష రేసులో ఉన్న ఆ ఇద్దరే కాదు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబికాసోనీ, ముకుల్ వాస్నిక్, చిదంబరం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్ ఇంకా అనేక మంది పార్టీ సీనియర్, జూనియర్ నాయకులు అందరూ కూడా అధ్యక్షుడు ఎవరైనా గాంధీల నాయకత్వంలో పనిచేయవలసిందే అనే అభిప్రాయాన్నే వ్యక్త పరిచారు. గాంధీలతో కాంగ్రెస్ ను వేరు చేసేప్రయత్నాలు ఫలించవని అంబిక సోనీ పేర్కొంటే, ముకు వాస్నిక్ సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ మూల స్థంభంగా నిలుస్తుంది, సోనియా గాంధీ పార్టీ నేతగా కొనసాగుతారని అన్నారు. సోనియా గాంధీ స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆమె అడుగుజాడల్లో కాంగ్రెస్ ముందకు సాగుతుందని వాస్నిక్ స్పష్టం చేశారు. అలాగే, రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తామని, మరో సీనియర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. నిజానికి, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు అధ్యక్ష పదవితో పాటుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సహా ఇతర కీలక పదవుల్లో కొనసాగుతారు. అయినా జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గాంధీలకు పదవులు ఎందుకు.. పదవులు ఉన్నా లేకున్నా ... కాంగ్రెస్ అంటే గాంధీలు, గాంధీలు అంటే కాంగ్రెస్ ... అంతేగా ...
http://www.teluguone.com/news/content/sonia-only-congress-supreme-says-party-seniours-25-145665.html