వ్యూహాలు బెడిసికొట్టాయి.. కింకర్తవ్యం?
Publish Date:Dec 27, 2024
Advertisement
సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటన తదననంతర పర్యవశానాలను గమనిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు తెలుగు సినీ పరిశ్రమను తన గుప్పిటిలోకి తెచ్చుకోవడమే కాకుండా అటు బీఆర్ఎస్, బీజేపీలను కంగు తినిపించారు. చాలా దృఢంగా నిలబడి.. తెలుగు సీనీ పరిశ్రమ మెడలు వంచడమే కాకుండా.. సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటనను ఆసరాగా చేసుకుని రేవంత్ సర్కార్ ను బదనాం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీలు వేరు వేరుగా వ్యూహాత్మకంగా వేసిన అడుగులు తడబడేలా చేయగలిగారు. ఈ విషయం గురువారం (డిసెంబర్ 26) సినీ ప్రముఖులతో రేవంత్ జరిపిన భేటీ అనంతరం నిర్ద్వంద్వంగా స్పష్టమైపోయింది. పుష్ప 2సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ గత 20 రోజులుగా కోమాలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంధ్యా థియోటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు పుష్ప2 సినిమా హీరో అల్లు అర్జున్ కారకుడన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై పై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ తరువాత హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దీంతో ఒక్క రాత్రి చంచల్ గూడా జైల్లో ఉన్న అల్లు అర్జున్ విడుదలయ్యారు. అది వేరు సంగతి. కానీ ఎప్పుడైతే పోలీసులు అల్లుఅర్జున్ పై కేసునమోదు చేశారో అప్పటినుండి బీఆర్ఎస్, బీజేపీలు పోటీలు పడి మరీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఈ విషయంలో ఆ రెండు పార్టీల నేతలూ అల్లు అర్జున్ కు ఏకపక్ష మద్దతు ప్రకటిస్తూ రేవంత్ సర్కార్ తెలుగు సినీమా పరిశ్రమను తెలంగాణ నుంచి తరిమేయాలనుకుంటోందా అన్న లెవల్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. నేషనల్ అవార్డ్ గ్రహీత అల్లుఅర్జున్ పై పోలీసులు కేసు పెడతారా ? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు, అటు బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి అల్లు అర్జున్ లాంటి సెలిబ్రిటీకే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలియదంటే ఇక సామాన్యులకు రేవంత్ రెడ్డి ఎవరో ఎలా తెలుస్తుందంటూ తనదైన స్టైల్ లో సెటైర్లు వేసి సంబరపడిపోయారు. అల్లు అర్జున్ పై కేసు అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి చేయగ లిగినంతా చేశాయి బీఆర్ఎస్, బీజేపీలు. ఈ విషయంలో అల్లు అర్జున్ కు పోటీలు పడి మద్దతు తెలపడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం ఆ రెండు పార్టీలూ నేల విడిచి సాము చేయడానికి ఇసుమంతైనా వెనుకాడలేదు. దీంతో పరిస్థితి ప్రభుత్వం ఒక వైపు అల్లు అర్జున్, టాలీవుడ్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక వైపు అన్నట్లుగా మారిపోయింది. అయితే గురువారం (డిసెంబర్ 27) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ తరువాత బీఆర్ఎస్, బీజేపీలు అల్లు వెనుక ర్యాలీ అవ్వడం ఎంత హేతు రహితం అన్న విషయం ప్రస్ఫుటంగా తెలిపోయింది. సంధ్యా ధియోటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్ అత్యుత్సాహంతో నిర్వహించిన ర్యాలీయే కారణమని సినీ ప్రముఖులంతా ఆ భేటీలో అంగీకరించేసినట్లుగానే కనిపించింది. అంతే కాదు.. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని రేవంత్ వారికి కరాఖండీగా చెప్పడమే కాకుండా, రాష్ట్రంలో టాలీవుడ్ కు అన్ని విధాలా సహకారం అందిస్తానని చెబుతూనే పరిశ్రమ ప్రభుత్వానికి సహకరించి తీరాలని స్పష్టం చేశారు. ఇక ఆ భేటీ తరువాత మరో విషయం ప్రస్ఫుటమైంది. సినీ ప్రముఖులంతా దాదాపుగా సీఎంకు సాగిలపడ్డారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు బెనిపిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండవన్న తన మాటకు కట్టుబడి ఉన్నట్లు రేవంత్ కుండబద్దలు కొట్టినా... ఆయనను పొగిడేందుకే సినీ ప్రము ఖులు పాటుపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేందుకు సహకరిస్తానని ముఖ్యమంత్రి చెప్పారనీ, అందుకు తమకు భారీ టాస్క్ ఇచ్చారనీ, దాని ముందు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు అంశాలు చాలా చిన్నవంటూ నిర్మాత దిల్ రాజు సినీ ప్రముఖుల తరఫున ప్రకటించేశారు. ఈ మెత్తం వ్యవహారంలో సినీ ప్రముఖులంతా సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ దే తప్పు అని అంగీకరించేసినట్లుగా కనిపిస్తోంది. ఈ సమావేశం వల్ల సినీ పరిశ్రమకు ఒరిగిందేమీ లేకపోయినా రేవంత్ ను పొగడడానికీ, ఆయనకు శాలువాలు కప్పడానికీ సినీ ప్రముఖులు పోటీలు పడటం చూస్తుంటే సంధ్యా థియోటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పిదాన్ని అంగీకరించి.. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పరామర్శలకు క్యూకట్టినందుకు రేవంత్ కు సారీ చెప్పినట్లు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక సారి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తరువాత రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని సీరియస్ గా తీసుకుందని అర్ధమైన తరువాత పరిశ్రమ పెద్దలలో ఒక స్పష్టమైన మార్పు కనిపించింది. తొలుత కమేడియన్ రాహుల్ రామకృష్ణతో మొదలై... నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వరకూ ఒక్కరొక్కరుగా మీడియా ముందుకు వచ్చి సంధ్యా థియోటర్ తొక్కిసలాట ఘటనకు బాధ్యుడు అల్లు అర్జున్ అని చెప్పడానికి వెనుకాడటం లేదు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ ఒకింత స్పష్టంగానే అల్లు అర్జున్ నాలుగు కార్లతో ర్యాలీగా సంధ్యాథియోటర్ కు వెళ్లి రోడ్ షో చేయడం తప్పేనని కుండ బద్దలు కొట్టేశారు. గతంలో బాలకృష్ణ వంటి హీరోలు తమ సినీమాలను తొలి రోజు ప్రేక్షకులతో కలిసి చూశారనీ, అయితే వారెవరూ ఇలా రోడ్ షో చేయలేదని గుర్తు చేశారు కూడా. హీరోలు కూడా సాధారణ మనుషులేనని భావిస్తే ఇలాంటి హడావుడి ఉండదని తమ్మారెడ్డి అల్లు అర్జున్ కు చురకలంటించారు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ సంఘటనను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో రాజ కీయ లబ్ధి కోసం వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీఆర్ఎస్, బీజేపీల వ్యూహాలు వికటించాయి. దీంతో ఆ పార్టీ నేతలు కింకర్తవ్యం అన్న డైలమాలో పడ్డారు.
http://www.teluguone.com/news/content/brs-and-bjp-stratagies-bumarang-25-190405.html