మన్మోహన్ ఆధునిక భారత వైతాళికుడు!
Publish Date:Dec 26, 2024
Advertisement
మాజీ ప్రధాని మన్మోహన సింగ్ తీవ్ర అస్వస్థతతో గురువారం (డిసెంబర్ 26) ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్.. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ గా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ను దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా చెబుతారు. తొలి ప్రధాని నెహ్రూ తర్వాత, ప్రధానిగా ఒక టర్మ్ పూర్తి చేసుకుని, రెండోసారి మళ్లీ ఎన్నికైన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుంది. ఆ తర్వాత నరేంద్ర మోదీ వరసగా మూడుసార్లు ప్రధాని అయ్యారు. నేడు మోదీ నాయకత్వంలో బలంగా ఉన్న భారత విదేశాంగ విధానం వెనుక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వేసిన పటిష్టమైన పునాదులే కారణమనడంలో సందేహం లేదు. ముఖ్యంగా 90 వ దశకంలో భారత్ తీసుకున్న రెండు ప్రధాన నిర్ణయాలు భారత్ దౌత్య విధానం, దృక్పథంలో మార్పులు తీసుకొచ్చాయి. అవే పీవీ నరసింహరావుతో కలిసి 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలో 1998 నాటి పోఖ్రాన్ అణు పరీక్షలు. ఈ రెండు నిర్ణయాలు మాత్రం ఆధునిక భారత గమనానికి బాటలు వేశాయి. మన్మోహన్ ఆర్దికవేత్త అయినప్పటికీ విదేశీ వ్యవహారాలపై కూడా పట్టు ఉంది. 2004లో అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత మన్మోహన్ సింగ్ దేశ విదేశాంగ విధానంపై దృష్టి సారించారు. భారత విదేశాంగ విధానంలో పోఖ్రాన్ అణు పరీక్షలు కీలకమైనవని విశ్వసించిన మన్మోహన్ సింగ్ వాజ్‌పేయి ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో వచ్చిందే అమెరికాతో పౌర అణు ఒప్పందం. మన్మోహన్ సింగ్ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది ముఖ్యమైనదనడంలో సందేహం లేదు మన్మోహన్ సింగ్ దూరదృష్టికి, నాయకత్వ పటిమకు ఈ ఒప్పందం అద్దంపట్టిందని చెప్పవచ్చు. వాగ్ధాటి ఉన్నవారే రాజకీయాలలో రాణిస్తారన్న ప్రచారానికి మన్మోహన్ సింగ్ తెరదించారని చెప్పాలి. ఆయన మాటల మనిషి కాదు.. చేతల మనిషి అని తన పని ద్వారా రుజువు చేసుకున్నారు. దేశ ప్రధానిగా దశాబ్దం పాటు ఆయన సేవలందించారు. ఆ దశాబ్ద కాలంలో దేశంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. అయితే ఆయన దేశానికి సేవలందించడం అన్నది ప్రధానిగానే ఆరంభం కాలేదు. ప్రధానిగా పీవీ నరసింహరావు బాధ్యతలు చేపట్టేనానికి దేశం దివాలా స్థితిలో ఉంది. భారత్ వద్ద విదేశీ మారకద్రవ్యం చాలా తక్కువగా ఉంది.దిగుమతులకు ఇబ్బందిపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సరిగ్గా ఆ సమయంలో మన్మోహన్ సింగ్ తన ఆర్థిక నైపుణ్యంతో దేశాన్ని గట్టెక్కించారు. బంగారాన్ని ప్రత్యేకంగా విమానంలో లండన్ తరలించి తాకట్టు పెట్టి దేశాన్ని దివాళా స్థితి నుంచి బయటపడేశారు. ఆయన దూరదృష్టి ఆర్థిక నైపుణ్యం కారణంగానే ఇప్పుడు భారత్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నది. ప్రత్యక్ష ఎన్నికలలో మన్మోహన్ సింగ్ ఎన్నడూ పోటీ చేసి ఉండకపోవచ్చు. కానీ ఆయన మాత్రమే దేశాన్ని గాడిలో పెట్టగలరని భావించిన పీవీ నరసింహరావు ఆయనను అర్థిక మంత్రి తన కేబినెట్ లో నియమించారు. ఆ బాధ్యతను ఆయన అనితర సాధ్యమన్న రీతిలో నిర్వహించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు. తర్వాత కాంగ్రెస్ విజయం సాధించినప్పుడు సోనియా ప్రధాని పదవి చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధానిగా ఆమె మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేసుకోవడం ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. సమర్థత ఆధారంగానే ఆయనకు ఆ పదవి దక్కింది. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన మన్మోహన్ సింగ్ ముద్ర దేశ ఆర్థిక ప్రయాణంలో అడుగు అడుగులోనూ కనిపిస్తుందనడంలో సందేహం లేదు.
http://www.teluguone.com/news/content/manmohansingh-vaitalika-of-modern-india-25-190370.html