అవినీతి కూపంలో యుపీయే ప్రభుత్వం
Publish Date:Apr 30, 2013
Advertisement
దేశంలో ఒకరు ఇనుప గనులు మేసేవారయితే మరొకరు బొగ్గు గనులు మేసేవారున్నారు. బొగ్గు గనుల కేటాయింపులలో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారుచేసిన రిపోర్టును సుప్రీం కోర్టుకు సమర్పించే ముందుగా వేరెవరికీ కూడా చూపించలేదని గట్టిగా నొక్కి చెప్పిన అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్, సీబీఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ స్వయంగా తమ రిపోర్టును న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్, బొగ్గు శాఖ మరియు ప్రధాని కార్యాలయానికి చెందిన మరో ఇద్దరికి ఆ రిపోర్ట్ చూపించడమే కాకుండా, వారి సూచనల ప్రకారం ఆ నివేదికలో చాలా మార్పులు కూడా చేశామని చెప్పడంతో సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురయి రాజీనామా చేయవలసి వచ్చింది. ఇక, రంజిత్ సింగ్ కోర్టులో మరో భయంకర నిజాన్ని కూడా బయటపెట్టారు. సీబీఐ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ, అది కూడా ప్రభుత్వంలో భాగమే గనుక 'దాని విచారణలపై ప్రభుత్వ ప్రభావం అనివార్యమని' స్పష్టం చేయడంతో ప్రభుత్వం కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. తానూ ఈ నెల 6వ తేదీన కోర్టుకు సమర్పించే అఫిడవిట్ లో సీబీఐ తయారుచేసిన ‘అసలు నివేదిక’, ‘మార్పులు చేయబడిన నివేదిక’లను సమర్పిస్తానని ఆయన కోర్టుకి తెలియజేసారు. ఆ విధంగా మార్పులు చేసిన వారి పేర్లను కూడా తన అఫిడవిట్ లో తెలియజేస్తానని ఆయన తెలిపారు. ఇంత కాలం పార్లమెంటులో ప్రతిపక్షాలు న్యాయశాఖా మంత్రి అశ్విని కుమార్ మరియు ప్రధాని డా. మన్మోహన్ సింగ్ రాజీనామాలకు ఎంతగా పట్టుబట్టినా కూడా లొంగని ప్రభుత్వానికి, ఇప్పుడు సుప్రీం కోర్టులో చివాట్లు, హరేన్ రావల్ రాజీనామా మరియు సీబీఐ డైరెక్టర్ తాజా వివరణ పెద్ద ఇరకాటంలో పడేశాయి. ఇక తప్పనిసరి పరిస్థితి వస్తే న్యాయశాఖా మంత్రి ఆశ్విని కుమార్ ను పదవి నుండి తప్పించడంద్వారా, యుపీయే ప్రభుత్వం ఈ గండం నుండి బయటపడే ప్రయత్నం చేయవచ్చును. ఇదంతా యాదృచికంగా కర్ణాటక ఎన్నికల సమయంలోనే జరగడంతో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారింది. కర్ణాటక రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం హయంలో అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్రాన్ని గాలి సోదరులు కొల్లగొట్టారని, అందువల్ల తమ పార్టీకి ఓటువేస్తే స్వచ్చమయిన ప్రభుత్వం, పాలన అందిస్తామని ప్రచారం చేసుకొంటున్న కాంగ్రెస్ అధినేతలు, ఇప్పుడు స్వయంగా బొగ్గు కుంభకోణంలో చిక్కుకోవడమే కాకుండా, దాని నుండి బయట పడే ప్రయత్నంలో ఏ ప్రభుత్వము సాహసించని విధంగా సీబీఐ నివేదికలను కూడా తమకు ఇబ్బందిలేని విధంగా మార్పులు చేసుకొని మరో పెద్ద తప్పు చేస్తూ సాక్షాత్ సుప్రీం కోర్టుకే దొరికిపోయారు. అయినాకూడా చేసిన తప్పుకి సిగ్గుపడకపోగా, ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తూ తప్పును కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్య నుండి బయటపడేందుకు యుపీయే ప్రభుత్వం ముందుగా సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్ ను పదవి నుండి తప్పించి ఉండవచ్చును. తరువాత మరీ తప్పనిసరయితే న్యాయశాఖా మంత్రిని కూడా పదవి నుండి తప్పించవచ్చును. కానీ, అవి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం అవుతుంది తప్ప శిక్ష మాత్రం కాదు. ఇదివరకు బయటపడిన 2జి స్పెక్ట్రం కుంభకోణంలో, దోషిగా నిలబడిన మాజీ టెలికాం మంత్రి ఎయస్. రాజా బెయిలు మీద బయటపడి తను నోల్లుకొన్న సొమ్ముతో హాయిగా బ్రతుకుతున్నాడు. తనను వేలెత్తి చూపనంత కాలం నిశబ్దంగా ఊరుకొన్నఆయన, పార్లమెంటరీ కమిటీ తనను వేలెత్తి చూపగానే, "నేను ప్రధాని డా. మన్మోహన్ సింగ్ కి, ఆర్ధిక మంత్రి చిదంబరానికి కూడా అన్ని సవివరంగా చెప్పి వారి అనుమతి పొందిన తరువాతనే ‘ఈ తప్పు’ చేశాను. గనుక, నేను దోషినయితే వారు కూడా దోషులేనని" ఆయన గట్టిగా బదులీయడమే కాకుండా, అవసరమయితే తన ఆరోపణలను స్వయంగా కోర్టులో కూడా నిరూపించగలనని సవాలు విసిరారు. కానీ, జేపీసీ తప్పు పట్టిన ఆయనకు శిక్ష పడలేదు. ఆయన తప్పు పడుతున్న ప్రధానికి, ఆర్ధిక మంత్రికి కూడా శిక్ష పడలేదు. అవినీతి జరిగిన విషయం అందరికీ తెలుసు. అదే ఈ లక్షల కోట్ల కుంభ కోణంలో సాదించిన ప్రగతి. ఎవరికీ శిక్షలు లేవు. జరిగిన నష్టానికి పరిహారము వసూలు అవ(లే)దు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అనుకొంటే దానికి మరో కొనసాగింపుగా ఇప్పుడు ఈ బొగ్గు కుంభకోణం బయట పడింది. కానీ అంతా షరా మామూలుగానే మొదలయి మామూలుగానే ఇదికూడా ముగుసిపోతుంది. ఈ విధంగా వరుసపెట్టి బయటపడుతున్నకుంభకోణాలలో దేశంలో అత్యున్నత పదవులలో ఉన్నవారే దోషులుగా నిలబడుతుంటే అటువంటి వారినుండి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి వ్యవస్థ ఉండాలి? ఎవరు ఏర్పాటు చేస్తారు?
http://www.teluguone.com/news/content/solicitor-general-37-22792.html