దీటుగా చైనా, బేలగా భారత్
Publish Date:May 1, 2013
Advertisement
గత నెల 15వ తేదిన భారత భూభాగంలోకి 19కి.మీ. మేర చొచ్చుకు వచ్చిన చైనా దేశ సైనికులు ముందు నాలుగు తాత్కాలిక స్థావరాలను వేసుకొన్నారు. ఒకవైపు భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నపటికీ, వారు వెనక్కి మళ్ళకపోగా, మళ్ళీ మొన్నమరొక కొత్త స్థావరం కూడా ఏర్పాటు చేసుకొన్నారు. భారత అభ్యంతరాలకు దీటుగా బదులిస్తూ చైనా విదేశాంగ శాఖా ప్రతినిధి, తమ సైనికులు ఏనాడు భారత భూభాగంలో అతిక్రమణలకి పాల్పడలేదని, వారు ప్రస్తుతం ఉన్న ప్రాంతం తమ చైనా భూభాగం లోనిదేనని, అందువల్ల వారిని వెనక్కి రప్పించే ప్రశ్నే ఉత్పన్నం అవదని, అయినా భారత్ తో తాము చర్చలకు ఎల్లపుడు సిద్దమేనని తెలిపింది. భారత్ కూడా చర్చలలో జరిగిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని కోరింది. దురాక్రమణకు పాల్పడిన చైనా ఇంత గట్టిగా జవాబిస్తుంటే, ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మాత్రం “ఇది స్థానికమయిన ఒక చిన్న సమస్య, దీనికి అంత ప్రాదాన్యం లేదు. దీనిని స్థానిక కమాండర్ల పరిధిలోనే పరిష్కారం కనుగొంటామని” తేలికగా కొట్టిపారేశారు. అదేవిధంగా ప్రతిపక్షాల అభ్యంతరాలను త్రోసిపుచ్చుతూ, భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ కుర్షిద్ ఈ నెల 9న తన చైనా పర్యటనను యధావిధిగా కొనసాగిస్తానని చెప్పారు. “వారిని వెనుతిరిగి యదా స్థానాలకు వెళ్ళాలని కోరాము. అందుకు ప్రతిగా వారు మాకు కొన్ని షరతులు విదించారు. దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించగలమనే నమ్మకం మాకుంది,” అని ఆయన చెప్పడం భారత మెతక వైఖరికి అద్దం పడుతోంది. దురాక్రమణ చేసిన చైనా తన తప్పును సరిదిద్దుకోకపోగా గట్టిగా వాదిస్తుంటే, దీటుగా జవాబు చెప్పవలసిన భారత ప్రభుత్వం చైనాను తమ సైనికులను వెనక్కి తీసుకోమని బేలగా అభ్యర్దిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మొన్న ఇరుదేశాల కమాండర్ల మద్య జరిగిన 3వ ఫ్లాగ్ మీటింగ్ కూడా విఫలమయింది. తమను భారత్ ఏవిధమయిన డిమాండ్స్ చేయలన్నా, ముందుగా భారత్ తన సరిహద్దు భూభాగాలయిన ‘ఫుక్చీ’ మరియు ‘చుమార్’ ప్రాంతాలలో నెలకొల్పిన శాశ్విత మిలటరీ కట్టడాలను వెంటనే తొలగించాలని, అప్పుడే చైనా భారత అభ్యంతరాలను పరిశీలించగలదని చైనా నిర్ద్వందంగా చెపుతోంది. అంతే గాకుండా, ప్రస్తుతం తమ భూభాగంలో తమ స్థావరాలకు కేవలం 500 మీటర్ల దూరంలో భారత్ సైనికులు ఇటీవల కొత్తగా నెలకొల్పిన స్థావరాలను కూడా వెంటనే తొలగించాలని చైనా డిమాండ్ చేసింది. ఫ్లాగ్ మీటింగ్ లో పాల్గొన్న చైనా మిలటరీ కమాండర్లు, తాము భారత కమాండర్ల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకొని వెనక్కి వెళ్ళలేమని, తమకు తమ కేంద్ర మిలటరీ కమాండ్ నుండి వెనక్కి మరలమని స్పష్టమయిన ఆదేశాలు వస్తే తప్ప తాము వెనక్కి వెళ్ళబోమని కూడా వారు స్పష్టం చేసారు. తద్వారా ప్రధాని డా.మన్మోహన్ సింగ్ చెప్పినట్లు ఇది స్థానిక మిలటరీ కమాండర్ల పరిధిలో పరిష్కరింపబడే ఒక చిన్న స్థానిక సమస్య ఎంతమాత్రం కాదని, చైనా వ్యుహాత్మకంగానే ఈ చొరబాటుకి దిగిందని స్పష్టం చేసింది. అయినప్పటికీ, వివిధ కుంభకోణాలలో తలమునకలయున్న యుపీయే ప్రభుత్వం, చైనా దురాక్రమణ పట్ల స్పందించవలసిన రీతిలో స్పందించకపోగా, సమస్యను తక్కువ చేసి ప్రజలను, ప్రతిపక్షాలను కూడా మభ్య పెట్టే ప్రయత్నాలు చేయడం చాలా దారుణం. కనీసం చైనాకు తగ్గట్లు జవాబు చెప్పే పరిస్థితిలో కూడా లేకపోవడం విచారకరం.
http://www.teluguone.com/news/content/china-37-22794.html