ఢిల్లీలో తెలంగాణ దీక్షల పోటీలు
Publish Date:Apr 29, 2013
Advertisement
రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాల హడావుడి అకస్మాత్తుగా తగ్గడంతో తేలికగా ఊపిరి పీల్చుకొన్న కాంగ్రెస్ నేతలు మళ్ళీ తమ దైనందిన ముటా తగాదాలలో ప్రశాంతంగా నిమగ్నమయిపోయారు. ఇటు పార్టీలోను గౌరవం లేక, అటు కేసీఆర్ చేత సన్నాసులు, దద్దమ్మలు అంటూ నిత్యం తిట్లు తినలేక సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ యంపీలు ఇంటి కంటే గుడి పదిలం అన్నట్లు కేసీఆర్ తిట్లు వినబడనంత దూరంగా వెళ్ళిపోవాలని డిల్లీలో వచ్చిపడ్డారు. పార్లమెంటు ముందు ధర్నాలు చేస్తే కనీసం ‘సోనియమ్మ నజర్’ తమ మీద పడకపోతుందా? పడితే తమ గోడు చెప్పుకోలేకపోతామా?’ అనే ఆశతో ఆమె వచ్చే దారిలో అడ్డంగా కూర్చొని ‘జై తెలంగాణ!’ అంటూ ధర్నాలు మొదలుపెట్టారు. పాపం వారావిధంగా మెట్ల మీద కూర్చొని వారు ధర్నా చేస్తుంటే, తెలంగాణకి మద్దతు ఇచ్చేవారు, సానుభూతిగా వారితో ఓ రెండు ముక్కలు మాట్లాడేసి పోతున్నారు. అయినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ యంపీలకి మూడొస్తే వారికిక ఎవరితోను పనిలేదు, కనుక ఓ రెండు రోజులు అక్కడే నిద్ర, భోజనం, స్నానపానాదులుకి సిద్ధం అయిపోయి వచ్చేశారందరూ. రెండు రోజుల్లో తమ పార్టీ అధిష్టానం మనసు మార్చేసుకొని తెలంగాణ ఇచ్చేస్తుందని కాదుగానీ, అక్కడ జంతర్ మంతర్ దగ్గిర తెలంగాణ జేయేసీ కూడా సంసద్ యాత్ర పేరిట ధర్నాలు చేస్తుంటే, తాము పార్లమెంటులోకెళ్ళి కూర్చొంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్తే కేసీఆర్ కొత్త బూతులతో తమని తిట్టిపోస్తాడనే భయంతో పాపం వాళ్ళు ఆ మెట్లకే అంటుకుపోయారు. ఇక, పూర్తిగా ఎన్నికల మూడులోకి వెళ్ళిపోయిన కేసీఆర్ ను చూస్తే ఇప్పుడప్పుడే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడేట్లు లేడని గ్రహించిన తెలంగాణ జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోధండరామ్, ఆయన అనుచరులు తెలంగాణాలో ఖాళీగా కూర్చొంటే మీడియా వాళ్ళు కంగాళీ చేసేస్తారనే భయంతో వారు కూడా ‘చలో డిల్లీ!’ అంటూ వచ్చి డిల్లీలో వాలిపోయారు. వారు కూడా రెండు రోజులు దీక్షలు చేసేందుకు పూర్తి బందోబస్తుతోనే డిల్లీవచ్చేరు. వారిని కూడా జాతీయపార్టీల నేతలు (అంటే దేశం అంతటా శాఖలున్న పార్టీలని కాదు. హిందీ మాట్లాడే సింగల్ రాష్ట్ర పార్టీల వాళ్ళని కూడా ఇప్పుడు మీడియా జాతీయపార్టీలు అని సంబోదిస్తున్నాయి కదా! ఆ పార్టీలకి చెందిన నేతలన్నమాట!) ఓ సారి వచ్చి పలకరించి, వారేర్పాటు చేసిన ఆటపాట చూసి మెచ్చుకొని వెళ్తున్నారు. అక్కడ పార్లమెంటు మెట్ల మీద తెలంగాణా కాంగ్రెస్ యంపీలు, ఇక్కడ రోడ్ల మీద తెలంగాణ జేయేసీ నేతలు పోటా పోటీల మీద దీక్షలు చేస్తుంటే దారిన పోయే వారు వారిని చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ సాగిపోతున్నారు. తెలంగాణా సాధన కోసం పోరాటాలు చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ, ఈవిధమయిన దీక్షలవలన సాదించేదేముంది? అందరి ముందు నవ్వులపాలవడం తప్ప. ఇక్కడ కేసీఆర్ “ఈసారి ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలిస్తే డిల్లీకి మనం పోనక్కరలేదు వారే మనకి సలాములు పెట్టుకొంటూ మన కాళ్ళ కాడికి వస్తారు. అప్పుడు మనమే ప్రభుత్వాన్ని శాసించి తెలంగాణాను సాదించుకొందాము,” అని గొప్పగా చెపుతునపుడు, మరి తన పెరట్లో తిరిగే కోడిపెట్టల వంటి తెలంగాణా జేయేసీ నేతలని డిల్లీకి ఎందుకు పంపినట్లు? “మా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణా ఇవ్వదు” అని కుండ బ్రద్దలు కొట్టిన మందా జగన్నాధం, “సోనియా గాంధీ తప్పక తెలంగాణా ఇస్తుందనే నమ్మకం ఉందని” చెప్పిన మధు యాష్కీ,పొన్నం ప్రభాకర్లు, “అసలు ఇస్తుందో లేదో తెలియదనే” మిగిలిన వాళ్ళు కలిసి ఆ మెట్ల మీద పడి ఏమి సాదిద్దామని దీక్షలు చేస్తున్నారు? మొత్తం మీద వీరందరూ కలిసి సాదించేదేమి లేకపోయినా,తమ ఉనికిని చాటుకోవడం కోసం తెలుగు జాతి పరువు మాత్రం తీస్తున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-congress-mps-37-22781.html