పొగ తాగటం హానికరం! వారి పక్కనుండటం ప్రమాదకరం!
Publish Date:Jun 1, 2017
Advertisement
మే 31… ప్రపంచ పోగాకు వ్యతిరేక దినం! అంటే… వాల్డ్ నో టోబాకో డే! నిజానికి పొగాకుకి నో చెప్పాల్సింది ఒక్క రోజు కాదు! ప్రతీ రోజూ, ప్రతీ నిమిషం టొబాకో గో బ్యాక్ అనాల్సిందే! అంతటి పెను ప్రమాదం అందులో వుంది! అయితే, గుట్కా, గంజాయి లాంటి ఇతర మాదక ద్రవ్యాలు ఒక ఎత్తు.. సినిమాల్లో హీరోలు సైతం స్టైల్ గా తాగేసే సిగరెట్ ఒక ఎత్తు! అసలు చాలా మంది సిగరెట్ కాల్చటం పెద్ద ప్రాణగండమేం కాదు అనుకుంటారు! వారికి ఎలాగూ కౌంట్ డౌన్ మొదలైనట్టే… కాని, వారొదిలే పొగ వల్ల పక్కనున్న వారికి కూడా ప్రాణాపాయం తప్పదు! ఈ ప్రమాదకర కోణమే సిగరెట్ ని మిగతా పొగాకు ఉత్పత్తుల కన్నా హింసాత్మకంగా మార్చేస్తుంది! ఇంతకీ పొగ తాగే వారి వల్ల పొగ పీల్చుకుంటోన్న వారికి ముంచుకొస్తున్న ప్రమాదాలేంటి? ఇంగ్లీషులో పొగ తాగకున్నా పీల్చుకునే వార్ని ప్యాసివ్ స్మోకర్స్ అంటారు! ఈ ప్యాసివ్ స్మోకర్స్ కి సిగరెట్ కాల్చే వారికి వస్తున్నట్టే ఉపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుందట. అలాగే, గొంతులోని స్వర పేటిక కూడా క్యాన్సర్ బారిన పడే భయానక స్థితి రావచ్చట! ఇక ఉపిరితిత్తులు, స్వర పేటిక మాత్రమే దెబ్బతింటాయిలే అని ఉపిరి పీల్చుకోవటానికి కూడా వీల్లేదంటున్నారు డాక్టర్స్! ప్యాసివ్ స్మోకర్స్ కి గుండె నొప్పులకు, ఛాతిలో నొప్పికి, గుండె పోటుతో మరణించే అవకాశాలు కూడా పుష్కలంగానే వున్నాయట! దీనికి కారణం… పొగ పీలుస్తూ వుండటం వల్ల గుండెకు రక్తాన్ని తీసుకు వెళ్లే నాళాలు మూసుకుపోవటమే! సిగరెట్ కాల్చేవారు మానవ బాంబుల్లాంటి వారంటున్నారు డాక్టర్స్! ఎందుకంటే, తాము మృత్యువాత పడుతోంది కాకుండా తమ పిల్లల్ని కూడా వీరు దారుణంగా దెబ్బతీస్తున్నారు. స్మోకర్స్ వుండే ఇళ్లలో చిన్న పిల్లలు పొగ పీలుస్తూ పెరగటం వల్ల పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు విపరీతంగా పెరుగుతాయట! కాబట్టి ఒక సిగరెట్ స్మోకర్ ఆ వ్యసనం మానేయటం అంటే… తాను బతికిపోవటమే కాదు… తన పిల్లల్ని కాపాడుకోవటం కూడా! గుండె, ఊపిరితిత్తులు లాంటి కీలకమైన అవయవాల్ని పాడు చేసే ప్యాసివ్ స్మోకింగ్ లావెక్కిపోయేలా కూడా చేస్తుందట! చెయిన్ స్మోకర్ల దెబ్బకి మీరుగాని రోజంతా పొగ పీల్చేస్తూ వుంటే.. త్వరలోనే లావైపోవటం తప్పదట! లంగ్స్ లోకి చెడు గాలి చేరిపోవటంతో శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలో మార్పులు వచ్చి ప్యాసివ్ స్మోకర్స్ లావైపోవటం డాక్టర్స్ గమనించారు! సిగరెట్ తాగకపోవటం బాధ్యత! సిగరెట్ తాగే వారి చేత ఎలాగోలా మాన్పించటం కర్తవ్యం! ఇక మీద అందరూ ఆ పనిలో వుండాలన్నమాట!
http://www.teluguone.com/news/content/smoking-45-75245.html





