స్మార్ట్ సర్వే ... ఓవర్ స్మార్ట్ సమాధానాలు!
Publish Date:Sep 2, 2016
Advertisement
హనుమంతుడి బొమ్మ వేయబోతే... చివరికి కోతి బొమ్మ ప్రత్యక్షమైందట పేపర్ మీద! ఈ మాటే గుర్తొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే గురించి చెప్పుకుంటే! అసలు రాష్ట్రంలో ఎంత మంది జనం వున్నారు, అందులో పేదలు ఎందరు, ధనికులు ఎందరు, ఎవరికి ఏం కావాలి, ఏ వర్గం సమస్యలు ఏంటి... వంటి అనేక ప్రశ్నలకి సమాధానంగా గవర్నమెంట్ ఈ సర్వేను ఎంచుకుంది. కాని, ఇప్పటిదాకా జరిగిన వ్యవహారం చూస్తే ఎవరైనా అవాక్కవుతారు! ఆఖరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలే షాకవుతున్నాయి సర్వే ఫలితాలు చూసి! సర్వే ఫలితాలు చూసి షాకవటం అంటే నిజాలు బయటపడ్డాయి అనుకోకండి! ఈ చిన్న ఉదాహరణ చూస్తే... మీకే అసలు పరిస్థితి అర్థం అవుతుంది. సర్వేలో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలోని సగం జనాభాని ప్రశ్నించారు. వివరాలు సేకరించారు. అయితే, ఇందులో సగానికి కంటే ఎక్కువ మంది ఏ రోజున పుట్టారో తెలుసా? 55శాతం మంది జనవరి ఒకటిన పుట్టారట! జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్ తో బాటు ఇంత మంది పుట్టటం ఎలా సాధ్యం? ఇప్పుడే అధికారులు ఇదే ప్రశ్న వేసుకుని ఆశ్చర్యపోతున్నారు! అంతే కాదు, సర్వేలో ఎక్కడ లోపం తలెత్తిందో తెలియదుగాని జిల్లా, మండల స్థాయిలో వున్న ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా సంవత్సరానికి రెండున్నర లక్షల కంటే ఎక్కువ సంపాదించటం లేదు! సర్పంచ్ లు, జిల్లా పరిషద్ సభ్యులు లాంటి వాళ్లు సంవత్సరం మొత్తం మీద రెండున్నర లక్షలకి మించి సంపాదించకపోవటం ఏంటి? ఇక దాదాపు పది లక్షల మంది ప్రజలు తమ సంవత్సర ఆదాయం సున్నాగా చెప్పారట! ఫైనల్ గా... ఇప్పటి దాకా జరిగిన యాభై శాతం సర్వేలో ఏం తేలిందో తెలుసా? ఎనభై శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనే వున్నారట! చంద్రబాబు సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేయిస్తోన్న ఈ సర్వేతో నవ్యాంధ్ర స్వరూప, స్వభావాలు తెలుస్తాయని అంతా అనుకున్నారు. ముందు ముందు చేపట్టబోయే సంక్షేమ పథకాలు వంటివి మరింత సమర్థంగా రూపొందించి, అమలు చేయవచ్చని ఆశించారు. కాని, ఇప్పటి దాకా వెలువడిన ఫలితాల్ని చూస్తే సర్వే సరిగ్గా సాగటం లేదన్నది స్పష్టంగా చెప్పవచ్చు. దీనికి కారణాలు అనేకం వుండవచ్చు అంటున్నారు నిపుణులు. సర్వే చేస్తున్న వారు తగినంత శ్రద్ధగా చేయకపోవటం ఒక కారణం అవ్వొచ్చు. రెండోది రాష్ట్రంలో చాలా మందికి సరైన ఆధారాలతో కూడిన బర్త్ ప్రూఫ్స్ వుండకపోవటం కావొచ్చు. బర్త్ డేట్ నమోదు అయ్యి లేనప్పుడు జనవరి ఫస్ట్ ఈజీగా గుర్తుండిపోతుంది కాబట్టి చాలా మందికి అధికారులు అది రాసి వుండవచ్చు! అయితే, జిల్లా, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు ఏ ఒక్కరూ రెండున్నర లక్షల కంటే ఎక్కువ ఆదాయం లేదని చెప్పటం ఆశ్చర్యకరమే! దీనికి కారణం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు రెండున్నర లక్షలు దాటితే అందకపోవటమే. ఇలాంటి అనేక అంశాల వల్ల సర్వేలో తప్పుడు సమాచారం చొరబడి వుంటుంది... సర్వేలో అనేక నమ్మశక్యం కాని అంకెలు బయటపడుతుండటంతో అన్ని వివరాలు రీ వెరిఫై చేసే యోచనలో వున్నారు అదికారులు. ప్రజలు అందించిన వివరాల్ని యూనివర్సిటీలు మొదలైన వాటి సాయంతో క్రాస్ చెక్ చేయించే ఆలోచన చేస్తున్నారు. ఇలా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వల్ల కొంత వరకూ పారదర్శకత, విశ్వసినీయత వచ్చే ఛాన్స్ వుంది. ఏది ఏమైనా అత్యంత జాగ్రత్తగా సర్వే జరిగేలా ప్రభుత్వం చూస్తే తప్ప దీని వల్ల ఫలితం వుండదు. ఎందుకంటే, ఇప్పటి దాకా జరిగిన సర్వేలో దాదాపు 5వందల మంది తమ మాతృ భాష ఇంగ్లీష్ అని చెప్పారట! ఇదెలా సాద్యం? మదర్ టంగ్ ని మీడియంగా భావించి చెప్పి వుంటారు! ఇలాంటి పొరపాట్లే చాలా జరిగి వుండవచ్చని సర్వే ఫలితాలు చూసిన అధికారులు భావిస్తున్నారు...
http://www.teluguone.com/news/content/smart-survey-45-65989.html





