నేటి నుంచీ నాగోబా జాతర
Publish Date:Jan 18, 2026
Advertisement
దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరఆదివారం (జనవరి 18) రాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందు కోసం సర్వం సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీ వరకూ జరిగే ఈ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరుగుతుంది. మెస్రం వంశీయుల ఆరాధ్య దైవమైన నాగోబాకు పుష్యమాస అమావాస్య రాత్రి నిర్వహించే మహాపూజలతో ఈ ఈ జాతర ప్రారంభం అవుతుంది. . ఈ జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. మెస్రం వంశీయులు విత్ర గోదావరి జలాలతో మంచిర్యాల జిల్లాలోని హస్తిన మడుగు నుంచి కాలినడకన వచ్చి నాగోబాకు అభిషేకం చేయడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. అనంతరం ఏడు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. జాతరలో భాగంగా ఈనెల 20న మెస్రం వంశీయులు ఆలయ శుద్ధి నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో ఇతరులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. అదే రోజు పురుషులు మాత్రమే పాల్గొనే పెర్సపేన్ పూజ, మహిళలు విశేషంగా పాల్గొనే భాన్ దేవత పూజలు జరుగుతాయి. ఈ జాతరలో భాగంగా ఈ నెల 22న గిరిజన దర్బార్ జరుగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖతో పాటుగా ఇతర ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. ఈ జాతర కోసం మెస్రం వంశీయులు తెల్ల దుస్తులు ధరించి.. కలమడుగు వద్ద గోదావరి జలాలను సేకరించి పాదయాత్రగా కేస్లాపూర్ చేరుకున్నారు. శనివారం (జనవరి 17) తూమ్ పూజలు ముగించుకున్నారు. ఆదివారం (జనవరి 18) ప్రధాన ఉత్సవంలో పాల్గొంటారు. ఈ జాతర కోసం కేస్లాపూర్ పొలిమేరలోని మర్రిచెట్టు ప్రాంతం మెస్రం వంశీయులతో సందడిగా మారింది. భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
http://www.teluguone.com/news/content/second-biggest-tribal-fest-nagoba-jathara-36-212685.html





