ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంత్రి లోకేష్ ఘన నివాళి
Publish Date:Jan 18, 2026
Advertisement
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం (జనవరి 18)ఉదయం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన మనవడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన తాత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే నటుడు నందమూరి కల్యాణ్ రామ్, పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద ఘన వివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘాట్‌ను అందంగా పూలతో అలంకరించారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవిత విశేషాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. అదలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో కారణజన్ముడు, యుగపురుషుడు, పేదల పెన్నిధిగా ఎన్టీఆర్ ను అభివర్ణఇంచారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడిగా నిలిచన ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడని పేర్కొన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు విద్యుత్, మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనితరసాధ్యమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్టీఆర్ చరిత్ర గతినే మార్చారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా అంతకు ముందు ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ఎన్టీఆర్ కు నివాళి అర్పిస్తూ.. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాక అయిన ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తారనీ, ఆ ఘనత ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కిన వరమనీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా, తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్నారని లోకేష్ పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/lokesh-tributes-to-ntr-on-his-death-anniversary-36-212682.html





