ప్రధాని మోడీకి మతి తప్పింది? అమిత్ షా అన్నారన్న గవర్నర్ కామెంట్లతో కలకలం..
Publish Date:Jan 4, 2022
Advertisement
ప్రధాని నరేంద్ర మోడీకి మతి తప్పిందా? ఆయనకు ఆహంకారం ఎక్కువా ? బీజేపీ కీలక నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారా? అంటే.. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. హర్యానాలోని చర్ఖీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సత్యపాల్.. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల విషయమై చర్చించేందుకు ఇటీవల తాను మోడీని కలిసినప్పుడు... రైతుల మరణాలపై ప్రధాని అహంకారంగా మాట్లాడారని అన్నారు సత్యపాల్ మాలిక్. ప్రధానితో భేటీ అయిన ఐదు నిమిషాలకే తమ మధ్య వాగ్వివాదం మొదలైందని చెప్పారు సత్యపాల్ మాలిక్. ఆందోళనల్లో 500 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని తాను ఆయన దృష్టికి తీసుకెళ్తూ.. కుక్క చనిపోయినా సంతాపం తెలుపుతారు కదా, మరి రైతుల మరణాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించానని పేర్కొన్నారు. దానికి మోదీ.. ‘‘వారేమైనా నా కోసం చనిపోయారా?’’ అని అహంకారంగా సమాధానమిచ్చారని గుర్తు చేశారు. అప్పుడు తాను ‘‘అవును.. మీరే పాలకులు కాబట్టి’’ అని సమాధానమిచ్చానని చెప్పుకొచ్చారు. చివరికి ఆ సమావేశం వాగ్వివాదంతోనే ముగిసిందని పేర్కొన్నారు. తర్వాత అమిత్ షాను కలవమని చెప్పారని పేర్కొన్న మాలిక్.. ఆయనతో జరిగిన సమావేశంలో ఏం జరిగిందో కూడా వెల్లడించారు. షా తనతో మాట్లాడుతూ.. మోడీకి మతి తప్పింది. కొందరు ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారన్నారు. ఏదో ఒక రోజు ఆయనకు వాస్తవం అర్థమవుతుంది..మీరు మాత్రం ఇవేమీ పట్టించుకోకండని తనకు సూచించారన్నారు మేఘాలయ గవర్నర్. మమ్మల్ని కలుస్తూ ఉండండని అమిత్ షా అని తనతో చెప్పారని సత్యపాల్ మాలిక్ వివరించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన రైతులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించాలని కూడా మాలిక్ డిమాండ్ చేశారు. రైతులకి అన్యాయం జరిగినా, వారి పట్ల అతిగా ప్రవర్తించినా ఆందోళన మళ్లీ మొదలవుతుంని మాలిక్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ను రెండుగా విడగొట్టినప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్‌గా సత్యపాల్ మాలికే ఉన్నారు. ఆ తర్వాత ఆయనను గోవా గవర్నర్‌గా పంపించారు. ప్రస్తుతం మేఘాలయ గవర్నర్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఇటీవలి కాలంలో మోీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తాజాగా సాగు చట్టాలు, ప్రధాని మోడీ వ్యవహారశైలి, అమిత్ షా రియాక్షన్ కు సంబంధించి సత్యపాల్ మాలిక్ చేసిన కామెంట్ల వీడియో వైరల్ గా మారింది. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు స్పష్టిస్తోంది. దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు సత్యపాల్ మాలిక్. రైతుల సమస్యలపై తాను చెప్పేది వినేందుకు మోదీ ఇష్టపడక అమిత్ షాను కలవమన్నారని అన్నారు. మోడీ అంటే అమిత్ షాకు చాలా గౌరవమని చెప్పారు. మోడీపై చెడుగా షా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, రైతులపై తన ఆందోళన అర్థమైందని మాత్రమే ఆయన చెప్పారని గవర్నర్ మాలిక్ చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీకి అహంకారం ఎక్కువని మాలిక్ అన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ అహంకారమే ప్రజాస్వామ్యంలో ఆందోళనకు కారణమని పేర్కొంది. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. గవర్నర్ చెప్పినా సరే, నిజాలు వినేందుకు మోదీ సిద్ధంగా లేరు.. ఆయనకు కావాల్సింది పొగడ్తలేనని విమర్శించారు.
http://www.teluguone.com/news/content/satyapal-malik-hot-comments-on-pm-modi-amith-sha-39-129604.html





