స్టేజీ పైనే మంత్రి, ఎంపీ ఫైటింగ్.. సోషల్ మీడియాలో వైరల్
Publish Date:Jan 4, 2022
Advertisement
ఒకతను రాష్ట్ర మంత్రి.. మరొకతను స్థానిక ఎంపీ. ఇద్దరూ గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవాళ్లే. కాని సహనం కోల్పోయారు. ముఖ్యమంత్రి సభలోనే చిల్లరగా వ్యవహరించారు. సభా వేదికపైనే వాగ్వాదానికి దిగారు. వేలాది మంది చూస్తుండగానే ఫైటింగ్ కు కూడా సిద్ధమయ్యారు. ఇద్దరూ దగ్గరగా వచ్చి కొట్టాడుతుండగానే వేదికపై ఉన్న ఇతర నేతలు ఎంటరై వాళ్లను పక్కకు తోసేశారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామనగరలో బి.ఆర్. అంబేద్కర్, కెంపెగౌడల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మంత్రి సి.ఎన్. అశ్వంత్ నారాయణ్, కాంగ్రెస్ ఎంపీ డి.కె. సురేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వంత్ నారాయణ్ మాట్లాడారు. ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ప్రజల నమ్మకాన్ని చూరగొనేందుకే బీజేపీ ప్రభుత్వం ఇక్కడకు వచ్చిందని, వారిని మోసం చేసేందుకు కాదని అన్నారు. కాంగ్రెస్ పై మంత్రి ఆరోపణలు చేస్తుండటంతో.. ఎంపీ సురేశ్ మద్దతుగా ఉన్న జనం కేకలు వేశారు. మంత్రి అశ్వంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.జనాల్లో రచ్చ జరుగుతుండగానే వేదికపైనా ఫైటింగ్ సీన్ క్రియేట్ అయింది. కాంగ్రెస్ ఎంపీ డి.కె. సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అశ్వంత్ మీదకు వెళ్లారు. మైకును లాక్కోబోయారు. ఇద్దరి మధ్యా వాగ్వివాదం చెలరేగింది. దాదాపు కొట్టుకునేంత పనిచేశారిద్దరు. భద్రతా సిబ్బంది, ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఘర్షణ అనంతరం కాంగ్రెస్ ఎంపీ సురేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎస్. రవి సహా ఆ పార్టీ నేతలు స్టేజీపైనే నిరసనకు దిగారు. కార్యక్రమం తర్వాత మంత్రి అశ్వంత్ పోస్టర్లు, బ్యానర్లను కాంగ్రెస్ నాయకులు చించేశారు. ఇక వారిద్దరి ఘర్షణకు సంబంధించిన వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్ గా మారింది.
http://www.teluguone.com/news/content/minister-mp-fighting-in-cm-meeting-39-129607.html





