కేవలం రూ.100 పెట్టుబడి..కోటి రూపాయల వ్యాపారం సామ్రాజ్యంగా ఎదిగిన రైతు సక్సెస్ స్టోరీ.!
Publish Date:Nov 12, 2026
Advertisement
వ్యవసాయ రంగంలో సరైన ఆలోచన, పట్టుదల ఉంటే ఏ విధంగా అద్భుతాలు సృష్టించవచ్చో ఒడిశాకు చెందిన ఓ యువ రైతు ఆచరణలో నిరూపించి చూపించారు. కేవలం నూట రూపాయల నామమాత్రపు పెట్టుబడితో ప్రారంభమైన ఒక చిన్న ప్రయోగం.. నేడు ఏడాదికి కోటికి పైగా టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని ఓగి గ్రామానికి చెందిన కార్తీక సాహు కుటుంబం ఎప్పటి నుంచో వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తోంది. అయితే ఆ ప్రాంతంలో ఏనుగులు, కోతుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల రైతులు సాగు చేసే ధాన్యం, వేరుశనగ వంటి సాంప్రదాయ పంటలు తీవ్రంగా దెబ్బతినేవి. దీనివల్ల అన్నదాతలు నిత్యం నష్టాలను చవిచూడాల్సి వచ్చేది. ఈ వన్యప్రాణుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే క్రమంలో కార్తీక సాహు ఉద్యానవన శాఖ నుంచి ఒక్కో మొక్క రూ.2 చొప్పున 50 కాగ్జీ నిమ్మ మొక్కలను కొనుగోలు చేశారు. అలా కేవలం వంద రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఆయన తన పొలంలో నిమ్మ సాగుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఎవరూ ఊహించని ఈ ప్రయోగం ఆయన కుటుంబానికి మంచి ఫలితాలను అందించింది. కాలక్రమేణా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సంతోష్ సాహు ఆ వ్యవసాయ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. గ్రామంలో నిమ్మ సాగు విస్తరించినప్పటికీ, సరైన మార్కెట్ సౌకర్యాలు లేకపోవడంతో రైతులు పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆయన గుర్తించారు. దీంతో కేవలం తన పొలానికే పరిమితం కాకుండా, చుట్టుపక్కల రైతుల నుంచి కూడా నిమ్మకాయలను సేకరించి పెద్ద మార్కెట్లకు తరలించే సరికొత్త వ్యాపార వ్యూహానికి తెరతీశారు. ఇది కూడా చదవండి: జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు: ఏపీ నగరాలకు చోటు.. విశాఖకు టాప్ ప్లేస్.! ప్రస్తుతం సంతోష్ సాహు తన స్వంత ఎకరంలో వందకు పైగా చెట్లను సాగు చేయడంతో పాటు, గ్రామంలోని సుమారు 200 మందికి పైగా రైతుల నుంచి పెద్ద ఎత్తున నిమ్మకాయలను సేకరిస్తున్నారు. భువనేశ్వర్, కటక్, అంగుల్, ధెంకనాల్ వంటి స్థానిక మార్కెట్లతో పాటు జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ ప్రాంతాలకు కూడా ఈ పంటను సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా, నాణ్యమైన ఈ కాగ్జీ నిమ్మకాయలు సముద్రాలు దాటి అమెరికా, బ్రిటన్ దేశాలకు సైతం ఎగుమతి అవుతుండటం విశేషం. ఈ విజయవంతమైన బిజినెస్ మోడల్ ద్వారా వచ్చే టర్నోవర్‌లో దాదాపు 60 శాతం మొత్తాన్ని సంతోష్ సాహు నేరుగా రైతులకు చెల్లింపుల రూపంలోనే అందజేస్తున్నారు. దీనివల్ల ఓగి గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లోని దాదాపు 500 కుటుంబాలకు పైగా నిమ్మ సాగు ఆధారంగా స్థిరమైన ఉపాధి లభిస్తోంది. రెండు ప్రధాన కోత సీజన్లలో కలిపి ఈ వ్యాపారం ద్వారా ఏడాదికి కోటి రూపాయలకు పైగా టర్నోవర్ నమోదవుతోంది. ఒకప్పుడు అడవి జంతువుల దాడితో అతలాకుతలమైన ఆ ప్రాంతం, నేడు రాష్ట్రంలోనే ఒక ప్రముఖ నిమ్మ సాగు కేంద్రంగా రూపాంతరం చెందింది. సాంప్రదాయ పంటల నష్టాలతో సతమతమయ్యే యువ రైతలకు ఈ సాహు కుటుంబం అవలంబించిన సామూహిక మార్కెటింగ్ విధానం ఒక దిక్సూచిలా మారింది. ప్రభుత్వాలు ఉద్యానవన శాఖలు ఇలాంటి వినూత్న ప్రయోగాలకు తగిన ప్రోత్సాహం అందిస్తే, గ్రామీణ భారతదేశంలో ఆర్థిక విప్లవం తథ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ ఎగుమతుల పరిధిని మరింత విస్తరించి, మరిన్ని వందల మంది స్థానిక రైతులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సంతోష్ సాహు తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: ఐసీసీ సదస్సు వేదికగా పవన్ తో లోకేష్ భేటీ: రాష్ట్ర పారిశ్రామిక పురోగతిపై చర్చ.! [ Santosh Sahu Success Story, Odisha Lemon Farmer Business, Kagzi Lemon Farming Profit,
Rs 100 to 1 Crore Business, TeluguOne News, Agriculture Success ]
http://www.teluguone.com/news/content/santosh-sahu-success-story-25-236909.html




