సోనియా ఆత్మకథ ఆధారంగా తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన.!
Publish Date:Nov 11, 2026
Advertisement
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యురాలు సోనియా గాంధీ రాసిన సంచలన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకం ఆధారంగా తెలుగులో అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కిస్తానని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సోనియా గాంధీ జీవిత చరిత్రను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించనున్నట్లు స్పష్టం చేస్తూ, పార్టీ నాయకులు కార్యకర్తలు ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ అర్ధాంగిగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తల్లిగా ఆమె పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు, దేశం కోసం ఆ కుటుంబం అందించిన త్యాగాలను ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి: ఏపీ పెట్టుబడులకు యూఏఈ ఆసక్తి..12 సంస్థలతో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్.! కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ ఎంతటి లోతైనదో వివరిస్తూ, సముద్రం ఎంత లోతుగా ఉంటుందో కాంగ్రెస్ రాజకీయ వ్యవస్థ కూడా అంతటి విశాలమైనదని ఆయన అభివర్ణించారు. సోనియా గాంధీ రాజకీయ జీవితం అత్యంత విజయవంతమైనదని, ఆమెకు ప్రధానమంత్రి పదవిపై ఎలాంటి వ్యామోహం లేదని కొనియాడారు. భర్త రాజీవ్ గాంధీ అకాల మరణం తర్వాత ప్రధాని అయ్యే అవకాశం పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ, ఆ పదవిని వ్యక్తిగతంగా ఆశించకుండా పి.వి. నరసింహారావును దేశ ప్రధాని పదవికి ఎంపిక చేసిన చారిత్రక రాజనీతిజ్ఞత సోనియా గాంధీ సొంతమని గుర్తుచేశారు. అలాగే, యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ఆమెనే ప్రధాని కావాలని కోరినప్పటికీ, ఆ పదవిని సునాయాసంగా త్యాగం చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రిగా కూర్చోబెట్టిన మహోజ్వల ఘట్టం ఓ చరిత్ర అని ఆయన కొనియాడారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమాకి కమర్షియల్ నిర్మాతల ప్రమేయం లేకుండా సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే పూర్తిస్థాయి నిర్మాతలుగా వ్యవహరిస్తారని జగ్గారెడ్డి ప్రకటించారు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సోనియా గాంధీ జీవితంలోని అరుదైన కోణాలను, త్యాగపూరిత ప్రయాణాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఈ సినిమాపై రాజకీయ వర్గాల్లోనూ, సినీ సర్కిళ్లలోనూ ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. మీకు నచ్చవచ్చు: సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ..ఆసక్తికరంగా మారిన పుస్తకం బహూకరణ.! [ Sonia Gandhi autobiography, Jagga Reddy film, Sonia Gandhi biopic, Belonging A Journey of Love, Congress party ]
రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలనేదే సోనియా గాంధీ ప్రధాన కోరిక అని జగ్గారెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక చిత్రానికి సంబంధించి త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సినిమా నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/sonia-gandhi-autobiography-25-236875.html





