మైసూరాకి అంత సీనుందా?
Publish Date:Nov 4, 2015
Advertisement
వైసీపీ నాయకుడు మైసూరారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి ‘రాయలసీమ సాధన సమితి’ అనే ఉద్యమ సంస్థ ద్వారా ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని చేపట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఉద్యమం చేసే విషయంలో మైసూరారెడ్డికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో వున్న కొంతమంది రాజకీయ నిరుద్యోగులు మద్దతుగా నిలవబోతున్నారని సమాచారం. ప్రత్యేక రాయలసీమ రావాలని ఏనాటి నుంచో పెద్ద గొంతుకతో నినదించే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇప్పుడు చప్పుడు చేయడంలేదు. ఇప్పుడు ఆ చప్పుడు చేసే బాధ్యతను మైసూరారెడ్డి అండ్ టీమ్ తీసుకున్నందుకు అభినందనలు. అయితే ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపే శక్తి మైసూరారెడ్డికి లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మైసూరారెడ్డి వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు కాబట్టి ఈ ఉద్యమానికి, జగన్ పార్టీకి ఎంతమాత్రం సంబంధం లేదని అనుకోవడం రాజకీయ అమాయకత్వమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిగానీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ ఎంతమాత్రం మనశ్శాంతిగా వుంచకూడదని కంకణం కట్టుకున్న జగన్ గారు పన్నిన సరికొత్త వ్యూహమిదని రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు. వైసీపీ జెండా కింద రాయలసీమ ఉద్యమం చేసినట్టయితే కోస్తాంధ్రలో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది కాబట్టి మైసూరాని రంగంలోకి దించారన్నది బహిరంగ రహస్యమే.
అయితే మైసూరాకి ఉద్యమాలు నడిపే శక్తి లేదని రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు. ఆయన మీటింగ్ పెడితే వందల్లో తప్ప జనాలు రాని పరిస్థితులు వున్నాయి. పైగా ప్రత్యేక రాయలసీమ ఉత్సాహం రాజకీయ నాయకులకే వుంది తప్ప అక్కడి ప్రజలకు లేదు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాయలసీమకు లభిస్తున్న ప్రాధాన్యాన్ని అక్కడి ప్రజలు గమనిస్తూనే వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మైసూరా చేపట్టిన ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తుస్సుమనడం ఖాయమన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/rayalaseema-sadhana-samithi-45-52033.html





