వరంగల్‌లో విజయానికి కడియం సహకరిస్తారా?
Publish Date:Nov 4, 2015
Advertisement
వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక వేడి పెరుగుతోంది. ప్రారంభ ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. టీఆర్ఎస్ నుంచి పసునూరి దయాకర్, టీడీపీ-బీజేపీ అభ్యర్థిగా దేవయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా చివరి నిమిషంలో జరిగిన మార్పులతో సర్వే సత్యనారాయణ నామినేషన్లు దాఖలు చేసి రంగంలో నిలిచారు. ఆటలో అరటిపండులాగా వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కూడా రంగంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి పదవీ స్వీకారం చేయడం వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చింది. కడియం శ్రీహరి రాజీనామా కారణంగా ఉప ఎన్నిక వచ్చింది. అయితే ఈ స్థానం నుంచి తిరిగి టిఆర్ఎస్ అభ్యర్థి గెలవటానికి మాజీ ఎంపీ కడియం శ్రీహరి ఎంతవరకు సహకరిస్తారనేది ఇప్పుడు సందేహాస్పదంగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
తాను రాజీనామా చేసిన స్థానం కాబట్టి ఈ స్థానం నుంచి తన కుమార్తెకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కడియం శ్రీహరి పార్టీ అధినేత కేసీఆర్‌కి ఎంత విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ వ్యక్తి... ఈ వ్యక్తి అని నాలుగైదు ఆప్షన్లు పరిశీలించి, ఒక వ్యక్తిని అభ్యర్థిగా ఖాయం చేసి చివరికి పసునూరి దయాకర్‌ని అభ్యర్థిగా ఎంపిక చేశారు. తన కుమార్తెను కాదని, తన దగ్గర వినయంగా వుండని పసునూరి దయాకర్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల కడియం హర్టయినట్టు తెలుస్తోంది. దానికితోడు వరంగల్ జిల్లాలో తన పార్టీలో వున్న రాజకీయ ప్రత్యర్థి, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యకి పసునూరి దయాకర్ సన్నిహితుడు. రాజయ్యకి, కడియం శ్రీహరికి మొదటి నుంచీ పడదు. దానికితోడు తన ఉప ముఖ్యమంత్రి సీటును లాగేసి దాన్ని కడియానికి ఇవ్వడంతో వారిమధ్య దూరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో రాజయ్య మద్దతు ఇస్తున్న పసునూరి దయాకర్ విజయానికి కడియం మనస్పూర్తిగా సహకరించడం సందేహమేనని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/-warangal-elections-45-52027.html





