రాయలసీమలో ఎర్రచందనం మాఫియా
Publish Date:Feb 13, 2012
Advertisement
స్మగ్లర్లకు అడ్డాగామారిన పీలేరు, చంద్రగిరి రాయలసీమ: రాయలసీమలో ఎర్రచందనం మాఫియా ముఠా రాజ్యం ఏలుతోంది. వీరు గుట్టుచప్పుడు కాకుండా కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనాన్ని రాష్ట్ర సరిహద్దుల నుంచి తరలిస్తున్నారు. వీరికి ఈ ప్రాంతంలోని కొందరు బడా రాజకీయ నాయకుల అండ దండలు ఉన్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చిన ఈ ప్రాంతంలోని అడవులు ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లకు స్వర్గధామంగా మారింది. చిత్తూరు జిల్లాలో సి.యం.కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి గల్లా అరుణకుమారి నియోజక వర్గాలైన పీలేరు,చంద్రగిరి, వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు రాజంపేట, కర్నూలు జిల్లా రుద్రవరం, చాగలమర్రి పరిధిలోని అటవీ ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకొని ఎర్రచందనం స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. విదేశాల్లో ఎర్రచందనానికి మంచి డిమాండ్ ఉంది. కిలో రూ.600 నుంచి రూ.800లకు అమ్ముతుండడంతో సీమ జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ముఠాలు స్మగ్లింగ్ సాగిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక నుంచి ఈ ఎర్రచందనాన్ని జపాన్, చైనాతోపాటు ఆగ్నేయ ఆసియా దేశాలకు తరలిస్తున్నారు. అటవీ అధికారులు ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. రాయలసీమలో గత రెండేళ్ళుగా సుమారు 900 మంది స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో దాదాపు 600 మంది చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పరిధికి చెందినవారే కావటం విశేషం. వీరి వద్ద నుంచి వేలాది టన్నుల ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. అటవీశాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం పెద్దగా కనిపించడంలేదు. ఎక్కడ ఎర్రచందనం చెట్టు కనిపిస్తే అక్కడ స్మగ్లర్లు వాలిపోయి ఆ చెట్టుని మాయం చేసేస్తున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం పెద్ద విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంగణంలో గతంలో ఒక ఎర్రచందనం చెట్టు ఏపుగా ఎదిగింది. రెండేళ్ళక్రితం ఈ ఎర్రచందనం చెట్టు హఠాత్తుగా మాయమైంది. ఈ సంఘటనలో ఎర్రచందనం స్మగ్లర్ల ప్రాభల్యం ఎంత ఉందో చెప్పకనే చెబుతోంది.
మాఫియాకు అధికారపార్టీ నాయకుల అండ
http://www.teluguone.com/news/content/rayalaseema-24-11871.html





