ఐసీయూలో దారుణం.. రోగిని కొరుక్కుతిన్న ఎలుకలు..
Publish Date:Mar 31, 2022
Advertisement
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు. ఇది పాట మాత్రమే కాదు వాస్తవం. ఇందుకు గతంలోనే అనేక ఘటనలు ఉన్నాయి. తాజాగా, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరో దారుణం జరిగింది. తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగి.. చేతి వేళ్లను, కాలి వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఇలా రెండు రోజులుగా జరుగుతోంది. డాక్టర్లు కట్టు కడుతున్నారే కానీ ఎలుకలు రాకుండా చేయలేకపోతున్నారు. తామేమీ చేయలేమంటూ ఆసుపత్రి వర్గాలు చేతులు ఎత్తేయడం మరింత దారుణం. కేసీఆర్ పాలనలో ఆసుపత్రి నిర్వహణ తీరు ఇంత అధ్వాన్నంగా ఉండటంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎంజీఎం హాస్పిటల్‌లో అసలేం జరిగిందంటే.... వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆర్‌ఐసీయూలో ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. శ్రీనివాస్ అనే రోగి ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. 4 రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. రోగి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు వైద్యులు. ఎంజీఎంలో చేరిన తొలిరోజే రోగి శ్రీనివాస్ కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరికాయి. వెంటనే కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో.. డాక్టర్లు ఎలుక కొరికిన చోట మందు రాసి కట్టుకట్టారు. మర్నాడు ఉదయం ఎలుకలు మరింత రెచ్చిపోయాయి. రోగి ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు, మడమ దగ్గర కొరికేయడంతో శ్రీనివాస్‌కి తీవ్ర రక్తస్రావమైంది. డాక్టర్లకు చెబితే.. మళ్లీ కట్టుకట్టి చికిత్స అందించారు. శ్రీనివాస్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరిగినా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని రోగి బంధువులు మండిపడుతున్నారు. ఐసీయూ వార్డులో ఇలాంటి ఘటన జరగడం దారుణమని అంటున్నారు. విషయం డాక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా తామేమి చేయలేమని అంటున్నారని ఆశ్చర్యపోతున్నారు. పైప్ లైన్ ద్వారా ఎలుకలు లోపలికి వచ్చి పేషెంట్లను కొరుక్కుతింటున్నాయని వైద్య సిబ్బందే చెబుతున్నారన్నారు. ఐసీయూలో పేషెంట్లను ఎలుకలు కొరుక్కుతింటుంటే.. ఇక సాధారణ రోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైప్ లైన్ల ద్వారా ఎలుకలు వస్తున్నాయని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడంపై వైద్యాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది ఆరోపిస్తున్నారు. ఎంజీఎం హాస్పిటల్ వర్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. రోగులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/rats-in-icu-of-mgm-hospital-warangal-25-133753.html





