రాజప్ప.. మీరు గ్రేటప్ప.. 40 ఏళ్ల టీడీపీ ప్రస్థానం..
Publish Date:Mar 31, 2022
Advertisement
తెలుగుజాతి ఆత్మగౌరం అంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నిజమైన సైనికుల్లా పలువురు నేతలు ఉన్నారు. అలాంటి వారిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్ప ముందు వరుసలో ఉంటారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం దివంగత ఎన్టీ రామారావు నేతృత్వంలో ఎంతటి వినయ విధేయతలు, విశ్వాసంతో పని చేశారో.. ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితోనూ కించిత్తు కూడా తేడా లేకుండా అంతే విశ్వాసంతో పనిచేస్తున్న వ్యక్తుల్లో నిమ్మకాయల చినరాజప్ప ప్రథముడిగా ఉంటారు. టీడీపీతోనే మమేకమై కొనసాగుతున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తానని, పార్టీలో ఎవరైనా సరే ఆయన నిర్ణయాలకే కట్టుబడి ఉంటారని చెబుతుంటారు చినరాజప్ప. పార్టీ అధినేత తనకు అప్పగించిన ఎంత చిన్న బాధ్యత అయినా.. పెద్ద బాధ్యత అయినా ఏమాత్రం బేషజం లేకుండా క్రమశిక్షణ గల సైనికుడి మాదిరిగా నిర్వర్తించడంలో ఆయనకు ఆయనే సాటి అంటారు టీడీపీ నేతలు, శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అలాంటి జిల్లాలో టీడీపీ బరువు బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసిన పార్టీ సైనికుడు చినరాజప్ప. 1992 నుంచి 2014 వరకు సుదీర్ఘంగా 22 ఏళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా చినరాజప్ప సేవలందించారు. టీడీపీలో ఇది ఓ రికార్డు అనే చెప్పాలి. టీడీపీకి తొలి నుంచీ తూర్పుగోదావరి జిల్లా పెట్టనికోటలా మారటానికి చినరాజప్ప చేసిన కృషి ఎంతో ఉందంటారు. రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చినరాజప్ప పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారంటారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం పెదగాడపల్లిలో 1953 అక్టోబర్ 1వ తేదీన నిమ్మకాయల చినరాజప్ప జన్మించారు. సాధారణ రైతు నిమ్మకాయల వెంకట రంగయ్య, కొండమ్మ దంపతులకు చినరాజప్ప పుట్టారు. తండ్రి నుంచి వ్యవసాయాన్ని వారసత్వంగా కొనసాగిస్తున్నారు చినరాజప్ప. చినరాజప్ప ఎం.ఏ చదివారు. చినరాజప్పది ఎవరినీ నొప్పించని మనస్తత్వం. వినయం, విధేయత లాంటి లక్షణాలు కలగలిసిన చినరాజప్ప అజాతశత్రువు అని ప్రజలు కొనియాడుతుంటారు. ఎంతటి స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండడం చినరాజప్ప సహజ లక్షణం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్వయంగా వెళ్లి పరిష్కరించడం ఆయన నైజం. కోనసీమలో పుట్టిన తనకు ఘన విజయం అందించిన పెద్దాపురం నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానంటారాయన. హోంమంత్రి అయినా.. నియోజకవర్గంలో సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు చినరాజప్ప. 1983లో ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. క్రియాశీలక పార్టీ సభ్యునిగా కొనసాగారు. చినరాజప్ప 1986లో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆపైన 1987లో ఉప్పలగుప్తం ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఉప్పలగుప్తం మండలాన్ని ఉత్తమ మండలంగా తీర్చిదిద్దారు నిమ్మకాయల. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఎన్నికై తన సమర్ధత ఏంటో నిరూపించుకున్నారు చినరాజప్ప. ఏపీలో పలు పదవులు చేపట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహించారు. చట్టసభల్లో అడుగుపెట్టానే చినరాజప్ప ఆకాంక్ష నెరవేరేందుకు రెండు దశాబ్దాల పాటు ఓపికగా నిరీక్షించాల్సి వచ్చింది. 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా బాధ్యతలను ఎంతో చక్కడా నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు జిల్లాలోని మెట్ట ప్రాంతమైన పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసిన చినరాజప్ప భారీ మెజార్టీతో విజయం సాధించారు. తొలి నుంచి చినరాజప్ప పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నారు. నవ్యాంధ్ర తొలి ప్రభుత్వంలో చంద్రబాబు కేబినెట్ లో చినరాజప్పను కీలకమైన ఉప ఉఖ్యమంత్రి, హోంమంత్రి, విపత్తు నివారణశాఖ మంత్రి పదవులు వరించాయి. ఎన్టీరామారావు పిలుపుతో టీడీపీ ఆవిర్భావం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన చినరాజప్ప ఇప్పటికీ ఆ పార్టీకి వీర విధేయుడి కొనసాగుతుండడం విశేషం. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైనప్పటికీ చినరాజప్ప విజయం సాధించడానికి ఆయన కృషి, పట్టుదల, నిబద్ధత, అజాతశత్రువుగా ప్రజల్లో సంపాదించుకున్న ప్రేమాభిమానాలే కారణం అంటారు. ఎంతటి అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నప్పటికీ ప్రస్తుత సీఎం అనాలోచిత నిర్ణయాలపై నిప్పులు చెరుగుతూనే ఉంటారు చినరాజప్ప. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ తీసుకునే అనాలోచిత నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటారు. అధికార పార్టీ నేతలు టీడీపీపై బురదజల్లేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ చినరాజప్ప తమ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని విరుచుకుపడుతూనే ఉంటారు. కరోనా సమయంలో బాధితులను పట్టించుకోని వైసీపీ సర్కార్ తీరును, సీఎం జగన్ వ్యవహారాన్ని తూర్పారపట్టారు.
http://www.teluguone.com/news/content/nimmakayala-chinarajappa-40-years-in-tdp-25-133755.html





