వైసీపీ బాటలోనే బీఆర్ఎస్?.. అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం
Publish Date:Jan 2, 2026
Advertisement
పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క ఓటమితో కుదేలైపోయిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కోలేక పలాయన మంత్రం పఠిస్తోందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం అందులో భాగమేనని అంటున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే అసెంబ్లీని బహిష్కరించి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం (జనవరి 5)న సభకు హాజరై.. మంగళవారం (జనవరి 6) నుంచి అంటే సభలో కృష్ణ, గోదావరి జలాలపై చర్చ జరిగే సమయానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకులు మాత్రం సభలో కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కోనేందుకు సభాపక్ష ఉప నేతల నియామకం తరువాత బీఆర్ఎస్ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హారీశ్రావుకి క్రెడిట్ దక్కే చాన్స్ ఇవ్వవద్దన్య వ్యూహంతోనే బీఆర్ఎస్ ఈ బాయ్ కాట్ నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా అసెంబ్లీలో నదీ జలాలపై చర్చను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడమంటే.. పలాయన మంత్రం పఠించడమేనని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకూ నదీ జలాల అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ ఇంత హఠాత్తుగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైతే.. జల వివాదాలకు ఆయనే సమాధానం చెబుతారు. అయితే కేసీఆర్ గైర్హాజరౌతున్న నేపథ్యంలో ఇటీవల శాసనసభాపక్ష ఉప నేతగా నియమితులైన హరీష్ రావు సభలో బీఆర్ఎస్ తరఫున ప్రసంగించాల్సి ఉంది. అదే జరిగితే సభ సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా మారిపోతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ డమ్మీ అయిపోతారు. ఇప్పటికే శాసనసభాపక్ష ఉప నేతగా హరీష్ రావు నియామకం కేటీఆర్ ను ఒకింత తక్కువ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇక జలవివాదాలపై హరీష్ రావు గట్టిగా గళం విప్పితే కేటీఆర్ పరిస్థితి పార్టీలో మరింత దిగజారుతుందన్న భావనతోనే బీఆర్ఎస్ ఆకస్మికంగా అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి సీఎం రేవంత్, హరీష్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనీ, వారిరువురి మధ్యా అరగంట భేటీ జరిగిందనీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంక్షోభం ముదిరేలా చేసుకోవడం కంటే.. జనం పలాయనం అనుకున్నా అసెంబ్లీ బాయ్ కాటే మేలని బీఆర్ఎస్ నిర్ణయించుకునట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశేషమేంటంటే పార్టీ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయాన్నిస్వయంగా హరీష్ రావే ప్రకటించడం విశేషం.
దీంతో రాజకీయ వర్గాలలో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అడుగుజాడలలో నడుస్తోందని అంటున్నారు. ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంంది.
http://www.teluguone.com/news/content/brs-following-ycp-25-211903.html




