రమణ పరిచయమే కానీ..ముడుపులతో సంబంధం లేదు
Publish Date:Feb 12, 2012
Advertisement
ఖమ్మం: మద్యం వ్యాపారి రమణ తనకు పరిచయమేనని, అయితే మద్యం ముడుపులతో తనకు కానీ తన కుటుంబానికి కానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఖమ్మంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ... తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎంతోమందితో పరిచయాలున్నాయని, అంతమాత్రాన ఎవరో పాల్పడే అక్రమాలతో తమకు ఎటువంటి సంబంధం ఉండదని అన్నారు. తమకే వందలాది ఎకరాల భూమి ఉన్నదని, 750 ఎకరాలకు పైగా భూమిని గిరిజనులకు పంపిణీ చేశామని గుర్తుచేశారు. మద్యం సిండికేట్లకు సంబంధించి ఎసిబి తయారు చేసిన రిమాండ్ రిపోర్టుపై విచారణ జరిపిస్తామని మంత్రి చెప్పారు. రిపోర్టుపై పునర్విచారణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరతామన్నారు. ఎసిబి రిమాండ్ రిపోర్టును మంత్రి తీవ్రంగా ఖండించారు. మద్యం వ్యాపారి రమణ డైరీ ఆధారంగా దానిలోని పేర్లతో ఎసిబి రిమాండ్ రిపోర్టు తయారు చేయడం సరికాదన్నారు. రమణ వాంగ్మూలం తీసుకోలేదన్నారు. ఆయన వాంగ్మూలాన్ని బట్టి చర్యలుంటాయని, ఎసిబి తప్పుడు రిపోర్టు ఇచ్చినట్టు తేలితే వారిపైనా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. జిల్లా ప్రజా ప్రతినిధులు అభివృద్ధిని కోరుకుటారు తప్ప అవినీతిని కోరుకోరని తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణపై ఆరోపణలు సత్యదూరమన్నారు. ఎవరో ఏదో ఆరోపిస్తే దాన్ని నిజమని నమ్మవద్దన్నారు. కమ్యూనిస్టు పార్టీలు రమణ నుంచి నిధులు తీసుకున్నట్టు ఒప్పుకున్న విషయమై మాట్లాడుతూ అది పరస్పర అంగీకారంతో తీసుకున్నదని, జిల్లాలోని కమ్యూనిస్టు పార్టీలు కూడా విరాళాలు తీసుకుంటాయని, పలికారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు ముడుపులు తీసుకున్న చరిత్ర లేదన్నారు. సిపిఎం, సిపిఐ, టిడిపి, న్యూడెమోక్రసి సహా కాంగ్రెసు ప్రజాప్రతినిధులెవరూ ముడుపులు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. అనవసరంగా జిల్లాలో ప్రముఖులపై మద్యం వ్యాపారి బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు.
http://www.teluguone.com/news/content/ramreddy-venkatareddy-24-11850.html





