ఏపీ ఉద్యోగులలో ఆరని పీఆర్సీ సెగలు
Publish Date:Feb 27, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులలో అశాంతి రగులుతోంది. అసహనం పెరిగిపోతోంది.పీఆర్సీ సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా, చివరకు ఫలితం లేకుండా పోయిందని,ఉద్యోగులు లోలోన ఉడికి పోతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, ‘కంచే చేనును మేసిన చందంగా సర్కార్’తో కుమ్ముక్కై ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బ తీశారని, ఉద్యోగ సంఘాల నాయకులపై ఉద్యోగులే ఫైరవుతున్నారు. మండిపడుతున్నారు. పీఅర్సీ (అశుతోష్ కమిటీ) నివేదికను కనీసం కళ్ల చూడకుండానే, అందులో ఏముందో తెలుసుకోకుండానే, సీఎస్ కమిటీ నివేదిక ఆధారంగా, సర్కార్ వండి వడ్డించిన పీఆర్సీకి నేతలు అంగీకరించడాన్ని,, ఉద్యోగులు జీర్ణం చేఉకోలేక పోతున్నారు. నిజానికి, ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ముందే అశుతోష్ కమిటీ నివేదికను ఇస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులకు, హామీ ఇచ్చింది. అయితే, అధికార కమిటీ నివేదిక ఇవ్వకుండానే, అనధికార సీఎస్ కమిటీ నివేదిక ఆధారంగా జీవోలు జారీ అయ్యాయి. అంతా అయిపోయింది,అయినా ప్రభుత్వం పీఆర్సీ నివేదికను మాత్రం బయట పెట్టలేదు. ఉద్యోగ సంఘ నేతలు అడగడం లేదు. నిజానికి, నిబంధనల ప్రకారం, అశుతోష్ కమిటీ నివేదికే అధికార నివేదిక. సీఎస్ కమిటీ నివేదిక అధికార నివేదిక కాదు. అయినా, సీఎస్ కమిటీ నివేదిక ఆధారంగానే పీఆర్సీ ఫిక్స్ చేసింది. అలా చేయడం సరికాదని, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అశుతోష్ కమిటీ నివేదికను ఎందుకు ఇవ్వరని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అందులో ఏవో కీలకమైన అంశాలు ఉండి ఉంటాయని అందుకే సీక్రెట్‌గా ఉంచుతున్నారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇది ఉద్యోగుల్లో మరింత ఉత్సుకతకు కారణం అవుతోంది. ఆ కమిటీ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం, ‘అయిపోయిం పెళ్ళికి బాజాలు ఎందుకు’ అన్నట్లుగా, పీఆర్సీ ఫైనలైజ్, అయిన తర్వాత ఇప్పుడు ఆ నివేదిక ఎందుకని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రభుత్వ వైఖరి పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. ఆ నివేదికలో ఏముందో తెలిస్తే కదా, ఉద్యోగులు ఏమి కోల్పోయారో తెలిసేది,కనీసం అందుకు కూడా తాము నోచుకోలేదా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందనే అభిప్రాయం ఉద్యోగులు వ్యక్త పరుస్తున్నారు. ఒక విధంగా ఇది తడి గుడ్డతో గొంతు కోయడంతో సమానమని, ఇందుకు ప్రభుత్వం, అధికార పార్టీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/prc-wounds-still-itching--ap-employees-39-132352.html





