తమిళనాట దళపతి విజయ్ పాదయాత్ర.. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు
Publish Date:Feb 11, 2025

Advertisement
తమిళనాడు రాజకీయాలలోకి ప్రముఖ హీరో తళపతి విజయ్ ప్రవేశమే ఒక సంచలనం అనుకుంటే.. ఆయన తన పార్టీ తమిళగ వెట్రిక కజగం (టీవీకే)కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకోవడం మరింత సంచలనం సృష్టించింది. దేశంలో పలు పార్టీలను విజయతీరాలకు చేర్చేలా వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిశోర్ గత కొంత కాలంగా ఎన్నికల వ్యూహకర్త కొలువు మానేసి బీహార్ లో సొంత పార్టీ పెట్టుకుని పూర్తిగా ఆ రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైపోయారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఎన్నికల వ్యూహకర్త అవతారం ఎత్తారు. తమిళనాట కొత్తగా రాజకీయ ప్రవేశం చేసిన హీరో విజయ్ పార్టీ టీవీకేకి ప్రత్యేక సలహాదారుగా ఎన్నికల వ్యూహాలు రచించనున్నారు.
ప్రశాంత్ కిశోర్ మామూలు వ్యక్తి కాదు. కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు అందుకోవడంలో పీకే వ్యూహాలు ఉన్నాయి. అలాగే 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహరచనే కారణమనడంలో సందేహం లేదు. ఇక 2021 ఎన్నికలలో తమిళనాడులో డీఎంకే విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టం వెనుకా ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచన ఉంది. అంతెందుకు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ వరుసగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టడం వెనుక ఉన్నదీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే. అటువంటి ప్రశాంత్ కిశోర్ ఇటీవల పార్టీలకు ఎన్నికల వ్యూహాల రూపకల్పనకు గుడ్ బై చెప్పేసి తన స్వరాష్ట్రం బీహార్ లో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీహార్ లో అధికారమే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పని చేసుకుంటున్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రాష్ట్ర సమస్యలపై ఆందోళనా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇటీవలే రాష్ట్రంలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష కూడా చేశారు.
ఇక తమిళనాట సినీ హీరోగా విపరీతమైన ప్రేక్షకాదరణ ఉన్న విజయ్ సినీమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టీవీకే పేర సొంత పార్టీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి రాజకీయాలలోకి దిగారు.ప్రస్తుతం చేతిలో ఉన్న ఒకే ఒక సినీమాను పూర్తి చేసి ఈ ఏడాది మలి భాగంలో పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితం కానున్నట్లు విజయ్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి ఇప్పటి నుంచే ప్రయత్నాలూ ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. అందులో బాగంగానే టీవీకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నారు. రాష్ట్రంలో టీవీకే బలోపేతం, ఎన్నికల వ్యూహాల రూపకల్పన, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడం వంటి అంశాలలో విజయ్ కు ఆయన పార్టీ టీవీకేకు ప్రశాంత్ కిశోర్ తోడ్పాటు, సహకారం అందిస్తారు. ఈ మేరకు ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ తో సంప్రదింపులు పూర్తయ్యాయని చెబుతున్నారు. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు.
దళపతి రాజకీయ ప్రస్థానం ఘనంగా ఉండేలా ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అందులో భాగంగా రానున్న రోజులలో విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేపట్టేలా ప్రశాంత్ కిశోర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/prashant-kishore-as-election-strategist-for-vijay-39-192712.html












