చిలుకూరు అర్చకుడు రంగరాజన్ పై దాడి రాజకీయమయ్యిందా?
Publish Date:Feb 11, 2025

Advertisement
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటన తెలంగాణలో పొలిటికల్ టర్న్ తీసుకుంది. రామరాజ్యం పేరిట వీరరాఘవరెడ్డి రంగరాజన్ నివాసానికి వెళ్లి దాడి చేయడాన్ని ప్రతిపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ఇప్పటికే రంగరాజన్ నివాసానికి వచ్చి పరామర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ లోనే రంగరాజన్ ను పరామర్శించారు. అవసరమైతే కేంద్ర బలగాలను రక్షణగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఘటనపట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సనాతన ధర్మంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. రంగరాజన్ పై దాడి వ్యక్తిగతంగా చూడకూడదని హిందుత్వంపై జరిగిన దాడిగా చూడాలని ఆర్ఎస్ఎస్ తో బాటు మిగతా హిందుత్వ సంఘాలు అభివర్ణించాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగరాజన్ కు ఫోన్ లోనే పరామర్శించారు. . పోలీసులు తగు చర్యలు తీసుకోగలరని ముఖ్యమంత్రి హామి ఇచ్చారు.దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ ఘటన తర్వాత రంగరాజన్ నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ రంగరాజన్ పై దాడి హిందుత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు రంగరాజన్ పై దాడికి గల కారణాలను పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. రామరాజ్యం పేరిట వీర రాఘవరెడ్డి ప్రయివేటు సైన్యాన్ని పెంచి పోషిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కొందరు యువకులను రామరాజ్యం ఆర్మీలో రిక్రూట్ చేసుకున్నాడు. నెలకు 20 వేల రూపాయల జీతం ఇస్తానని ఆశచూపి పెద్ద ఎత్తున యువకులను రిక్రూట్ చేసుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలకు వెళ్లి విరాళాలు సేకరించడం అతడి టార్గెట్ . ఇందులో భాగంగానే ఈ నెల 7న చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇంట్లో ఎంటర్ అయ్యాడు . విరాళాలు అడిగాడు. చిలుకూరు బాలాజీ దేవాలయంలో హుండీ లేకపోవడం తగదని వీర రాఘవరెడ్డి వర్గీయులు వారించారు. బూట్లతో రంగరాజన్ నివాసంలో ప్రవేశించడమే గాకుండా దేవాలయాన్ని తమకు అప్పగించేయాలని డిమాండ్ చేశారు. రామరాజ్యం రావాలంటే దేవాలయంలో హుండీ ఏర్పాటు చేయాల్సిందేనని బెదిరించారు. ఆయన తనకు తాను రాముడి అంశ అని చెప్పుకునేవాడు. రంగరాజన్ పై దాడి చేసిన రామరాజ్యం ప్రయివేటు సైన్యంలోని ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు. వీరిలో కర్త, కర్మ, క్రియ అయిన వీర రాఘవరెడ్డి కూడా ఉన్నారు. రామరాజ్యం పేరిట సంఘ విద్రోహకార్యకలాలు ఏమైనా జరిగాయా అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
ఉస్మానియా యూనివర్శిటీ మాజీ రిజిస్టార్ ప్రొఫెసర్ సౌందర్యరాజన్ పూర్వికులు ఈ దేవాలయానికి వంశపారపర్యంగా అర్చకులుగా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడే రంగరాజన్ ఈ దేవాలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారు. 1988 బయో మెడికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆగమశాస్త్రాలు కూడా ఆయన చదువుకున్నారు.
చిలుకూరి బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఉంది. దీనిని విసా బాలాజీ అనేమరో పేరు ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లు ఇక్కడికి వస్తుంటారు. 1995లో అర్చక ప్రవేశం పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.
చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని దేవాదాయ శాఖలో కలపాలనే ప్రభుత్వ ప్రయత్నాలను రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ గట్టిగానే అడ్డుకున్నారు.. సుప్రీంకోర్టు నుంచి మార్గదర్శకాలను తెచ్చుకున్నారు. రాష్ట్రంలోని ప్రయివేటు గుళ్ల యజమానుల తరపున పోరాడే వన్ మ్యాన్ ఆర్మీ సౌందర్య రాజన్ . మూడు భాషల్లో వెలువడే వాక్ అనే ఆధ్యాత్మిక పత్రికకు సంపాదకులుగా ఉన్నారు అర్చకవారసత్వాన్ని రద్దుచేయాలని ప్రభుత్వ నిర్ణయంపై సౌందర్య రాజన్ గట్టిగానే పోరాడారు. ఆయన కున్న ముగ్గురు కొడుకుల్లో రంగరాజన్ రెండో వాడు. దేవాదాయశాఖ అధికారి ఒకాయన మీకు ఉన్న ముగ్గురు కొడుకులు విద్యాధికులు. మీరు రిటైర్డ్ రిజిస్టార్. కొడుకులు అర్చకవృత్తికి దూరంగా ఉన్నారు. అర్చక వారసత్వం కోసం ఎందుకు? దేనికి పోరాడుతున్నారు అని ప్రశ్నిస్తే నేను అర్చకత్వం చేస్తానని రంగరాజన్ ముందుకొచ్చారు. అప్పటికే లక్షల రూపాయల జీతాన్ని వదిలేసి అర్చకత్వం స్వీకరించిన రంగరాజన్ పై జరిగిన దాడిని ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఖండిస్తున్నారు. . రంగరాజన్ కు బాసటగా నిలుస్తున్నారు.
http://www.teluguone.com/news/content/is-the-attack-on-chilukur-priest-rangarajan-politicized-39-192716.html












