లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం.. సిట్ అరెస్టులపై మింగలేక కక్కలేక జగన్?
Publish Date:Feb 11, 2025

Advertisement
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో వైసీపీ పూర్తిగా ఇరుక్కుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచ్చులో జగన్ చిక్కుకున్నారా? అంటూ పరిశీలకులు ఔననే అంటున్నారు. తిరుమలలడ్డూ ప్రసాదం కల్తీ విషయం తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ చేశారంటూ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. జగన్ హయాంలో లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో పూర్తిగా రాజీపడ్డారనీ, కాసుల కక్కుర్తితో కల్తీ నెయ్యి వాడకానికి తలుపులు బార్లా తెరిచారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీపై విమర్శలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఈ తరుణలో సుప్రీం కోర్టు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ విషయంపై దర్యాప్తునకు స్వతంత్ర సిట్ ను నియమించింది.
సుప్రీం కోర్టు నియమించిన సిట్ లో సీబీఐ నుంచి ఇద్దరు సభ్యులు, రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ఇద్దరు సభ్యులు, అలాగే కేంద్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ నుంచి ఒక సభ్యుడూ ఉణ్నారు. ఈ స్వతంత్ర సిట్ ఏర్పాటైన తరువాత కొంత కాలం నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎటువంటి వార్తలూ వినిపించలేదు. పూర్తి నిశ్శబ్దం ఆవరించింది. దీంతో వైసీపీయులు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారంటూ విమర్శలు గుప్పించింది. తమ పార్టీని అప్రదిష్ట పాలు చేయడానికే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారని దుయ్యబట్టింది. చంద్రబాబు చేసినవి అసత్య ఆరోపణలు కనుకనే ఆయన కల్తీ నెయ్యి విషయం మాట్లాడటం లేదని విమర్శలు గుప్పించింది. సుప్రీం కోర్టు నియమించిన సిట్ దర్యాప్తులో చంద్రబాబు ఆరోపణలన్నీ సత్యదూరాలని తేలుతాయనీ, అందుకే ఆయన మౌనం వహించారనీ ఎడాపెడా చెలరేగిపోయింది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను కూడా ఇందులోకి లాగి.. చంద్రబాబు లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనెయ్యి ఆరోపణలు చేసినందుకే వెంకన్న దేవుడికి ఆగ్రహం వచ్చిందని, అందుకే ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగిందనీ భాష్యాలు చెప్పింది. ఇతర విషయాలపై దృష్టి పెట్టారని విమర్శలు గుప్పించింది. వైసీపీ నేతలే కాదు స్వయంగా వైసీపీ అధినేత జగన్ కూడా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సుప్రీం కోర్టు స్వతంత్ర సిట్ ను నియమించడంతో తన అసత్యాలు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారనీ, అందుకే మౌనం వహించారనీ జగన్ విమర్శలు గుప్పించారు. ఇలా విమర్శలు గుప్పించడం ద్వారా తాము సుప్రీం కోర్టు నియమించిన సిట్ నిష్పాక్షిక దర్యాప్తు చేస్తుందని విశ్వసిస్తున్నామని చెప్పకనే చెప్పినట్లైంది.
అయితే ఇక్కడ చంద్రబాబు మౌనం వైసీపీకి వేసిన ట్రాప్ అని ఇప్పుడు తేటతెల్లమైంది. ఎందుకంటే తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తి నెయ్యి వినియోగం కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు నియమించిన సిట్ కొన్ని అరెస్టులు చేసింది. ఇప్పుడు తన దర్యాప్తులో స్వతంత్ర సిట్ కనుగొన్న విషయాలను వైసీపీ, జగన్ అంగీకరించి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అరెస్టులన్నీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వెనుక వైసీపీయుల హస్తం ఉందని రుజువు చేసేవిగానే ఉన్నాయి. దీంతో వైసీపీ, జగన్ పరిస్థితి ఇప్పుడు కక్కలేక, మింగలేక అన్నట్లుగా తయారైంది.
అదే చంద్రబాబు సుప్రీం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిన తరువాత కూడా ఈ అంశంపై తరచుగా మాట్లాడుతూ, దర్యాప్తు పురోగతిపై ఆరాతీస్తూ ఉండి ఉంటే.. జగన్, ఆయన పార్టీ నేతలూ సిట్ పై తమకు నమ్మకం లేదంటూ ప్రకటనలు గుప్పించేవారు. అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా మైనం వహించడం ద్వారా చంద్రబాబు జగన్ కు ఉచ్చు పన్నారని భావించాల్సి ఉంటుంది. సిట్ దర్యాప్తులో నెలల పాటు ఎటువంటి పురోగతీ కనిపించకపోవడంతో ఇది కూడా తన అక్రమాస్తుల కేసులా మూలనపడినట్లే అని భ్రమించిన జగన్ చంద్రబాబు అబద్ధాలు చెప్పారనీ, సిట్ దర్యాప్తు సజావుగా సాగుతోందనీ, దానిపై విశ్వాసం ఉందనేలా ప్రకటనలు గుప్పించి నేరుగా చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నట్లైంది. ఈ కేసులో సిట్ ఇప్పటికే ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖర్, వైష్ణవీ డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, భూలేబాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్ లను అరెస్టు చేసింది. దీంతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు అభూత కల్పనలు కావనీ, అక్షర సత్యాలనీ రుజువైనట్లైంది. ఇప్పుడు అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లను మార్చేసి, ఇష్టం వచ్చిన వారికి కట్టబెట్టినట్లు సందేహాతీతంగా రుజువైంది. వైసీపీ అధినేత జగన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.
http://www.teluguone.com/news/content/jagan-in-cbn-silense-trap-39-192707.html












