మంత్రి మహీధర్ రెడ్డిపై ప్రకాశంజిల్లా వాసుల ఆగ్రహం
Publish Date:Mar 28, 2012
Advertisement
ప్రకాశంజిల్లాకు చెందిన రాష్ట్రమంత్రి మహీధర్ రెడ్డిపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు తనవద్దకు వచ్చిన ప్రజలతో ఆయన అవహేళనగా మాట్లాడుతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. ప్రజలు చిన్న చిన్న పనులకోసం వచ్చినప్పుడు మంత్రిగారు అసలు వారికి ఇంటర్వ్యూనే ఇవ్వటం లేదు. అతికష్టం మీద సామాన్యులకు మంత్రిగారి దర్శనం దొరికితే ఆయన రుసరుసలు చూసి వారు బేజారెత్తిపోతున్నారు. ఇటీవల మార్కాపురంలో ఉద్యోగి బదిలీ విషయమై మంత్రికి ఒక లేఖ ఇవ్వాలని భావించి ఆయన్ను కలుసుకున్నారు. ఆ లేఖ చూసిన వెంటనే మహీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ "నేను ఎవరనుకుంటున్నావు, మంత్రినా, బంట్రోతునా, నేనేమన్నా బదిలీల దుకాణం పెట్టుకున్నానా?'' అంటూ పెద్దగా అరవడంతో ఆ ఉద్యోగి షాక్ తిన్నాడు. ఒంగోలులో కొందరు అంగన్ వాడీ టీచర్లు ఆయనను కలిసినప్పుడు కూడా వారికి ఇటువంటి చేదు అనుభవమే ఎదురయింది. ప్రజలు ప్రతి చిన్నపనికి తమ వద్దకు ఎందుకు వస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులదని, వెళ్ళి వారిని నిలదీయండని మంత్రి మహీధర్ రెడ్డి వారికి ఉచిత సలహా కూడా ఇస్తున్నారు. దీంతో ప్రజలతో పాటు ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు కూడా మంత్రిగారిపై గుర్రుగా ఉన్నారు.
http://www.teluguone.com/news/content/prakasam-district-24-12971.html





